Cancer | న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కొన్ని రకాల మొండి వ్యాధులకు ఆయుర్వేద వైద్య చికిత్సలో బంగారాన్ని(ఔషధాల్లో) వాడటమన్నది మన దేశంలో ఎన్నో వేల ఏండ్ల క్రితమే ఉంది. క్యాన్సర్ కణతులను అరికట్టడంలో ‘బంగారం’ విశిష్ట లక్షణాల్ని కలిగి ఉందని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ‘యూరోపియన్ జర్నల్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీ’ నివేదిక ప్రకారం, క్యాన్సర్ కణతులపై కీమోథెరపీ కన్నా బంగారాన్ని కలిపిన ఔషధ చికిత్స మెరుగైన ఫలితాల్ని ఇచ్చినట్టు ఆస్ట్రేలియాకు చెందిన ‘ఆర్ఎంఐటీ’ వర్సిటీ, భారతీయ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వీళ్లు తయారుచేసిన బంగారంతో కూడిన ఔషధం, జంతువుల్లో ట్యూమర్(క్యాన్సర్ కణతి) పెరుగుదలను 82 శాతం వరకు అడ్డుకోగలిగింది. గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో ‘సిస్లాటిన్’ను కీమోథెరపీ డ్రగ్‌గా వాడుతారు. దీంతో పోల్చితే బంగారాన్ని కలిపిన ఔషధం 27 రెట్లు మెరుగ్గా పనిచేసింది. క్యాన్సర్ కణాల పెరుగుదలను ‘సిస్లాటిన్’ 29 శాతం అడ్డుకోగా, బంగారంతో కూడిన ఔషధం 82 శాతం వరకు అడ్డుకుంది.
శుద్ధమైన బంగారంలోని రసాయన సమ్మేళనానికి స్థిరత్వం ఎక్కువ. ఈ విశిష్ట లక్షణంతో క్యాన్సర్ చికిత్సలో ఎదురవుతున్న ఔషధ నిరోధకత సమస్యను పరిష్కరించవచ్చునని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌కు కీమోథెరపీ డ్రగ్‌గా ‘ఫిబ్రోసాఅర్కోమా’ను విరివిగా వాడతారు. అయితే క్యాన్సర్ కణాల్లో రానురాను ఔషధ నిరోధకత పెరిగింది.
‘ఫిబ్రోసా అర్కోమా’కు బదులు బంగారాన్ని కలిపిన ఔషధం వాడగా.. 7.5 రెట్లు మెరుగైన ఫలితం వచ్చిందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో ‘ప్లాటినం’ ఆధారిత డ్రగ్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘బంగారం’తో కూడిన ఔషధ చికిత్సను అభివృద్ధి చేయటంలో తాజా పరిశోధన కీలకమైన ముందడుగుగా నివేదిక పేర్కొన్నది.