Australia | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : ఆస్ట్రేలియా ఖండం స్థిరమైన భూభాగంలా కనిపిస్తున్నప్పటికీ అది క్రమేణా అనూహ్య వేగంతో ఉత్తర దిశగా ఆసియా ఖండం వైపు కదులుతున్నది. అలా ఏటా 2.8 అంగుళాల (7 సెంటీమీటర్ల) చొప్పున ముందుకు సాగుతున్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మన గోళ్ల పెరుగుదలకు సమానమైన ఈ వేగం చాలా స్వల్పమైనదే అనిపిస్తున్నప్పటికీ కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత గణనీయ భౌగోళిక పరివర్తనకు దారితీసి ఆ ప్రాంత స్వరూపాన్ని, వాతావరణాన్ని, జీవవైవిధ్యాన్ని మార్చేస్తుందని ఈ దృగ్విషయంపై అధ్యయనం చేసిన కర్టిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెంగ్-జియాంగ్ లీ స్పష్టం చేశారు.
మనకు నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్తులో ఆస్ట్రేలియా ఖండం ఆసియాను ఢీకొంటుందని తెలిపారు. ఖండాలు విడిపోయి చివరికి మళ్లీ చేరువయ్యే చక్రీయ నమూనాలో ఈ కదలిక ఓ భాగమని పేర్కొన్నారు. దాదాపు 8 కోట్ల ఏండ్ల క్రితం అంటార్కిటికా నుంచి విడిపోయిన ఆస్ట్రేలియా గత 5 కోట్ల సంవత్సరాల నుంచి ఉత్తర దిశగా కదులుతున్నదని వివరించారు.