న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై అడ్వకేట్ రాకేశ్ కిషోర్ షూ విసిరే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఇవాళ అటార్నీ జనరల్(Attorney General) ఆర్ వెంకటరమణి కీలక నిర్ణయం తీసుకున్నారు. అడ్వకేట్ రాకేశ్ కిషోర్‌పై నేరపూరిత కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అక్టోబర్ 6వ తేదీన ఓ కేసు వాదిస్తున్న సమయంలో.. ధర్మాసనంలో కూర్చుకున్న సీజేఐ గవాయ్‌పై అడ్వకేట్ రాకేశ్ షూ విసిరే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాశ్ సింగ్‌కు అటార్నీ జనరల్ లేఖ రాశారు.
1971 నాటి కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 15(1)(బీ) కింద నేర కోణంలో అడ్వకేట్ రాకేశ్‌పై విచారణ చేపట్టేందుకు అనుమతి ఇస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు. అడ్వకేశ్ రాకేశ్ చర్యలు నిందాపూర్వకంగా ఉన్నాయని, సుప్రీంకోర్టులోని అత్యున్నత వ్యక్తిని అగౌరవపరుస్తున్నట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాంటి ప్రవర్తనతో న్యాయ వ్యవస్థ పనితీరు నిర్వీర్యం అవుతుందన్నారు.
సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. ఆయన కూడా అడ్వకేట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. జస్టిస్ సూర్యకాంత్, జాయ్‌మాల్యా బాగ్చీ ధర్మాసనం వద్ద ఆ కేసు ఉన్నట్లు తెలిపారు. అయితే కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం.. సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదిపై క్రిమినల్ విచారణ చేపట్టాలంటే అప్పుడు అటార్నీ జనరల్ సమ్మతి అవసరం ఉంటుంది.