భోపాల్ : బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల వయసుగల అత్యాచార బాధితురాలికి ఆమెను రేప్ చేసిన నిందితుని ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. అక్కడ ఆ రేపిస్ట్ ఆమెపై మళ్లీ మళ్లీ రేప్ చేశాడు. ఛతర్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు ఈ ఏడాది జనవరి 16న బడికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరింది. కానీ ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. ఆమె కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమెను, ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తిని ఫిబ్రవరి 17న హర్యానాలోని గురుగ్రామ్‌లో పోలీసులు గుర్తించారు. నిందితుడు వేరొక గ్రామానికి, వేరొక సామాజిక వర్గానికి చెందినవాడు. బాలికను కిడ్నాప్ చేసి, రేప్ చేసినందుకు పోక్సో చట్టం కింద అతనిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. బాధితురాలిని పునరావాసం కోసం బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)కి పంపించారు. ఈ కమిటీ మొదట ఆమెకు పన్నాలోని వన్ స్టాప్ సెంటర్లో ఆశ్రయం కల్పించింది.
ఆ తర్వాత నిర్దేశిత విధానాలను పక్కనబెట్టి, నిందితుని వదిన ఇంటికి బాధితురాలిని పంపించింది. నిందితుని వదిన, బాధితురాలు వరుసకు అక్కచెల్లెళ్లు అవుతారు. నిందితుడు జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్లీ బాధితురాలిపై పదే పదే అత్యాచారం చేశాడు. కమిటీ నిర్లక్ష్యం వల్ల నిందితునికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. పన్నా కలెక్టరేట్లో జరిగిన ప్రజల సమస్యల పరిష్కార కార్యక్రమానికి హాజరైన బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి, సీడబ్ల్యూసీకి ఇచ్చిన ఆదేశాల్లో, “మీరు ఇచ్చిన రూలింగ్‌ను మరోసారి సమీక్షించుకోండి” అని ఆదేశించారు.
దీంతో సీడబ్ల్యూసీ చైర్మన్, తదితర అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఆ బాలికను తిరిగి వన్ స్టాప్ సెంటర్‌కు ఏప్రిల్ 29న పంపించారు. అక్కడ బాధితురాలికి కౌన్సెలింగ్ నిర్వహించినపుడు ఆమెపై అదే నిందితుడు లైంగిక దాడులకు పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయాన్ని వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, జిల్లా మహిళ, శిశు అభివృద్ధి శాఖ అధికారి కప్పిపుచ్చారు. కానీ మీడియా ద్వారా ఈ దారుణాలు వెలుగు చూశాయి. దీంతో సీడబ్ల్యూసీ చైర్మన్, సభ్యులు; వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్, కౌన్సెలర్లపై కేసులు నమోదు చేశారు.