Atiq Ahmed | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతను స్థాపించిన వేల కోట్ల నేర సామ్రాజ్యంపై ప్రస్తుతం పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. అతీక్ ఇద్దరు కుమారులు జైళ్లలో ఉండగా.. మరో ఇద్దరు మైనర్ కొడుకులు జువెనైల్ హోమ్‌లో ఉన్నారు. అతీక్ భార్యతో పాటు పలువురు ఇతర కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతీక్ అక్రమ మార్గంలో సంపాదించిన వేల కోట్ల రూపాయలు, ఆస్తులు ఎవరికి చెందుతాయి? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అతీక్ అహ్మద్‌కు యూపీతో పాటు ఢిల్లీ, ఇతర రాష్ర్టాల్లో కూడా విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈడీ అధికారులు రూ.1,400 కోట్ల మేర అక్రమ ఆస్తులను జప్తు చేశారు. 50 షెల్ కంపెనీలను ఈడీ గుర్తించింది.
ఇటీవల కాల్పుల్లో చనిపోయిన అతీక్ ఒక లేఖ రాశారని, తాను ఒకవేళ చనిపోతే ఆ లేఖను సీల్డ్ కవర్లో సీజేఐ, యూపీ సీఎంకు అందజేయాలని కోరారని ఆయన తరఫు న్యాయవాది మంగళవారం వెల్లడించారు. అయితే ఆ లేఖ తన వద్ద లేదని, ఆయన ఎవరి ద్వారా ఆ లేఖను పంపే ఏర్పాట్లు చేశాడో తనకు తెలియదని ఆయన అన్నారు. ఆ లేఖలో ఏ విషయం ఉందో కూడా తనకు తెలీదన్నారు.