మర్చులా, నవంబర్ 4: ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 36 మంది మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీపావళి తర్వాత స్వస్థలం నుంచి పని ప్రదేశానికి కార్మికులు తిరిగొస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. 43 సీట్ల సామర్థ్యం కలిగిన బస్సులో ప్రమాద సమయంలో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. గర్వాల్ మోటాల్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ప్రైవేట్ బస్ పౌరీ నుంచి రామ్ నగర్‌కు తిరిగొస్తుండగా ఉదయం 8 గంటలకు మర్చులా ప్రాంతంలో 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయిందని జిల్లా మెజిస్ట్రేట్ అలోక్ కుమార్ పాండే తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.4 లక్షలు; గాయపడిన వారికి కేంద్రం రూ.50 వేలు, రాష్ట్ర సర్కారు రూ.1 లక్ష పరిహారం ప్రకటించాయి.