న్యూఢిల్లీ : అధిక రక్తపోటు చికిత్సకు కొత్త విధానం త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. గతంలో మందులు పని చేయని వారికి కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ ప్రయోగాత్మక ఔషధాన్ని ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. దీనికి బాక్స్‌డ్రోస్టాట్ అని నామకరణం చేసింది. అన్‌కంట్రోల్డ్ లేదా రెసిస్టెంట్ హై బ్లడ్ ప్రెజర్ గల వారిపై ఇటీవల నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షల్లో బాక్స్‌డ్రోస్టాట్ ఆశాజనక ఫలితాలనిచ్చింది. ఈ ఔషధానికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభిస్తే, అధిక రక్త పోటుకు చికిత్స చేయడానికి అనేక దశాబ్దాల తర్వాత వచ్చిన కొత్త విధానాల్లో ఒకటి అవుతుంది. ఈ పరీక్షల ఫలితాలను శాస్త్రవేత్తలు శనివారం మ్యాడ్రిడ్‌లో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్, 2025కు సమర్పించారు. ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో కూడా ప్రచురించారు.
కనీసం నాలుగు వారాలపాటు రెండు లేదా అంతకన్నా ఎక్కువ చికిత్సలను పొందిన తర్వాత కూడా అధిక రక్తపోటుతో బాధపతున్న 800 మంది వయోజనులను పరిశోధకులు ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. దీనిలో పాల్గొనడానికి అర్హత పొందాలంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 140-170 ఎంఎంహెచ్‌జీ మధ్య ఉండాలి. వీరిని మూడు బృందాలుగా విభజించారు. ఒక బృందానికి 1 మిల్లీగ్రామ్ బాక్స్‌డ్రోస్టాట్, మరొక బృందానికి 2 మిల్లీగ్రాముల బాక్స్‌డ్రోస్టాట్, మూడో బృందానికి ప్లాసెబో ఇచ్చారు. వీరం తా అప్పటికే తాము వాడుతున్న మందులను కూడా కొనసాగించారు. బాక్స్‌డ్రోస్టాట్ తీసుకున్న 10 మందిలో నలుగురు 12 వారాలకు ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయికి చేరుకున్నారు. అదే ప్లాసెబో తీసుకున్న ప్రతి 10 మందిలో ఇద్దరి కన్నా తక్కువ మంది మాత్రమే ఈ స్థాయికి చేరుకోగలిగారు. ప్రతి రోజూ 1 లేదా 2 ఎంజీల బాక్స్డ్రోస్టాట్ను తీసుకున్నవారి సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ (రీడింగ్‌లో పైన ఉండే సంఖ్య) ప్లాసెబో తీసుకున్నవారితో పోల్చినపుడు 9 నుంచి 10 ఎంఎంహెచ్‌జీ వరకు తగ్గింది. గుండెజబ్బుల ముప్పును తగ్గించడానికి ఈ తగ్గుదల ఎంతో ఉపయోగపడుతుంది.
మూత్రపిండాలు లవణాలను నియంత్రించడానికి, శరీరంలోని నీటి సమతుల్యతను కొనసాగించడానికి అడ్రెనల్ గ్లాండ్స్ ఉపయోగపడతాయి. ఈ అడ్రెనల్ గ్లాండ్స్ ఉత్పత్తి చేసే హార్మోన్ అల్డోస్టెరోన్ను బ్లాక్ చేయడంపై బాక్స్‌డ్రోస్టాట్ దృష్టి పెడుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో ఇదే నూతన విధానం. బాక్స్‌డ్రోస్టాట్ వాడటం వల్ల దుష్ఫలితాలు నామమాత్రంగా ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనకర్తల్లో ఒకరైన జెనిఫర్ బ్రౌన్ మాట్లాడుతూ, రక్తపోటు నియంత్రణకు వాడే కొన్ని మందులు కొందరు రోగులకు పడకపోవచ్చునని, అటువంటివారికి బాక్స్‌డ్రోస్టాట్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పరిశోధన సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు ఈ ఏడాది చివరినాటికి సమర్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.