NDA | న్యూఢిల్లీ, మే 28: మరి కొన్ని నెలల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ)లో లుకలుకలు ప్రారంభమయ్యాయా? గత వారం జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలు ఈ ఊహాగా నాలకు బలాన్నిస్తున్నాయి. పట్టాభిషేకానికి బీహార్ సిద్ధంగా ఉంది..చిరాగ్‌కు స్వాగతం చెప్పేందుకు బీహార్ సిద్ధంగా ఉంది అంటూ లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఫొటోలతో బీహార్ రాజధాని పాట్నా నగరమంతా వెలసిన పోస్టర్లు, హోర్డింగులు కలకలం సృష్టించాయి. చిరాగ్ పాశ్వాన్‌కు సంబంధించి ఎన్డీఏలో ఇప్పటికే సాగుతున్న వదంతులకు ఈ పోస్టర్లు కొత్త బలాన్ని అందచేశాయి.
అయితే వెంటనే ఈ పోస్టర్లు, హోర్డింగులను పార్టీ నాయకత్వం తొలగించింది. మే 19న చిరాగ్ స్వయంగా రంగంలోకి దిగి వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఉంటారని, ప్రస్తుతానికి బీహార్‌లో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని వివరణ ఇచ్చారు. బీహార్ రాజకీయాల్లోకి రావాలన్న కోరికను చిరాగ్ ఇదివరకే బయటపెట్టారు. 2030లో జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తానే ఉంటానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అంత దూరం వరకు ఆయన వేచి ఉండే పరిస్థితులు కనిపించడం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
బీహార్ రాజకీయాలలో చిరాగ్ చురుకైన పాత్ర పోషిస్తే అది ఎన్డీఏకి లాభదాయకమా లేక నష్టదాయకమా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతున్నది. పోస్టర్ల ఘటన చిరాగ్ వ్యూహమేనని బీహార్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు వికాస్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీని వెనుక బీజేపీ హస్తం ఉండక పోవచ్చునని, బీహార్‌లో కులాలకు సంబంధించి ఎటువంటి సాహసాలు చేసేందుకు బీజేపీ ప్రస్తుతం సిద్ధంగా లేదని ఆయన తెలిపారు. చిరాగ్‌ని ప్రోత్సహించడం ద్వారా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూకి హాని చేయాలని బీజేపీ కోరుకోదని, అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు నితీశ్‌కి మనస్తాపం కలిగించే నిర్ణయాలేవీ బీజేపీ తీసుకోదని ఆయన అంచనా వేశారు. జేడీయూని మరింత బలహీనపరచడం వల్ల బీజేపీకి ప్రస్తుతానికి ఒరిగే లాభం కూడా ఏమీ లేదని ఆయన అన్నారు.
బీహార్ రాజకీయాలలో తన శక్తిని పెంచుకోవడానికి చిరాగ్ ప్రయత్నించే అవకాశం ఉందని ఆయన అన్నారు. జేడీయూకి ఎన్ని సీట్లు కేటాయిస్తే తన పార్టీకి కూడా అన్ని సీట్లు కేటాయించాలని చిరాగ్ డిమాండ్ చేయవచ్చని, ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలన్నది ఆయన ఆలోచనని కుమార్ చెప్పారు. వినవస్తున్న వార్తలను బట్టి చూస్తే 50-60 సీట్లు తమకు కేటాయించాలని చిరాగ్ కోరుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ తనకు కేంద్రం కన్నా బీహార్ రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తని చిరాగ్ వెల్లడించడాన్ని రానున్న రోజుల్లో ఆయన పాత్ర ఎలా ఉండనున్నదో స్పష్టంగా సూచిస్తున్నది.
ఎన్డీఏ అంతా బాగుందని చెప్పలేమని మరో సీనియర్ జర్నలిస్టు పుష్యమిత్ర అభిప్రాయ పడ్డారు. చిరాగ్ పోస్టర్ల ఘటనలో బీజేపీ ప్రమేయం ఉండి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీఏలో అతి పెద్ద భాగస్వామ్య పక్షమైన బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశ ఎప్పటినుంచో ఉందని, బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి కావాలని బీజేపీ ఆశిస్తోందని ఆయన తెలిపారు. చిరాగ్ మద్దతుదారులు ముఖ్యమంత్రి పదవి కోరుతున్నారని, బీజేపీకి అత్యంత సన్నిహితుడని ప్రతిఒక్కరూ భావించే చిరాగ్ పాశ్వాన్ బీజేపీ అనుమతి లేకుండా ఆ పని చేస్తారని ఆలోచించలేమని ఆయన చెప్పారు. ఎన్డీఏ కూటమిలోని జితన్ రాం మాంఝి, ఉపేంద్ర కుష్వాహా బలహీనంగా ఉన్నందున చిరాగ్ ద్వారా బీజేపీ ఈ నాటకం ఆడించి ఉండవచ్చని పుష్యమిత్ర అభిప్రాయపడ్డారు.