Actress Shabana Azmi | మహారాష్ట్రలోని డోంబివల్లిలోని కేడీఎంసీ (KDMC) శాస్త్రీనగర్ ఆసుపత్రిలో శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రే ఒక మహిళా వైద్యురాలితో పాటు అక్కడ ఉన్న వైద్య సిబ్బందిపై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ అమానుష ఘటనను ప్రముఖ బాలీవుడ్ నటి శబానా అజ్మీ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. మహిళా వైద్యురాలిపై కార్పొరేటర్ దాడి చేసిన విజువల్స్ అత్యంత అసహ్యకరంగా ఉన్నాయని, అతనిపై తీసుకోవాల్సిన కనీస చర్య అతనికి తక్షణమే కఠిన శిక్ష పడేలా చేయడమేనని ఆమె డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా, ఈ ఘోరంపై ప్రశ్నిస్తే ‘మేము గతంలో కూడా ఇలాగే చేశాం’ అంటూ సదరు కార్పొరేటర్ అదొక గౌరవ సూచకంగా, గర్వంగా సమాధానం చెప్పడం మరీ దారుణంగా ఉందని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సదరు ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన ఒక గర్భిణీ శిశువుకు ఎన్ఐసీయూ (NICU) బెడ్ అవసరమవగా, అక్కడ బెడ్స్ ఖాళీ లేకపోవడంతో బిడ్డ భద్రత దృష్ట్యా వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని గైనకాలజిస్ట్ డాక్టర్ సృష్టి బావిస్కర్, డాక్టర్ వైభవ్ సాలుంఖేలు ఆ కుటుంబ సభ్యులకు సూచించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోగి బంధువులు స్థానిక కార్పొరేటర్ రమేష్ మాత్రేకు సమాచారం అందించడంతో, అతను తన మద్దతుదారులతో కలిసి ఆసుపత్రికి చేరుకుని ఎలాంటి విచారణ లేకుండానే వైద్యులను బూతులు తిడుతూ భౌతిక దాడికి దిగారు. అడ్డువచ్చిన మహిళా నర్సులను కూడా నెట్టేసి దుర్మార్గుల్లా ప్రవర్తించిన దృశ్యాలన్నీ ఆసుపత్రి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దారుణానికి నిరసనగా ఆసుపత్రి వైద్యులు, నర్సులు విధులు బహిష్కరించి ‘కామ్ బంద్’ ఆందోళన చేపట్టగా, తీవ్ర ఒత్తిడి నడుమ విష్ణునగర్ పోలీసులు కార్పొరేటర్ రమేష్ మాత్రేతో పాటు మరో నలుగురిపై ఐపీఎస్, మెడికల్ సర్వీస్ పర్సన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Arrest this third class shivsena corporator !@Shivsenaofc @mieknathshinde pic.twitter.com/k8fU90GNSd
— /^\@/\/0j (@patilmb91) July 7, 2026