గౌహతి: యునైటెడ్ పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్ (యూపీఆర్ఎఫ్) కమాండర్, అస్సాం వీరప్పన్‌గా పేరుగాంచిన మంగిన్ ఖల్హవు హతమయ్యాడు. స్వంత గ్రూప్‌కు చెందిన క్యాడర్ జరిపిన కాల్పుల్లో అతను ప్రాణాలు కోల్పోయినట్లు అస్సామీ పోలీసులు తెలిపారు. కర్బీ అన్లాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అస్సాంలో మంగిన్ పేరుమోసిన స్మగ్లర్. ఆ రాష్ట్ర అడవుల్లో ఉన్న చెట్లను స్మగ్లింగ్ చేయడంలో దిట్ట. అతన్ని గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌తో పోలుస్తారు. కెంగ్పిబుంగ్ ప్రాంతంలో శనివారం యూపీఆర్ఎఫ్ దళ సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో మంగిన్ తలలోకి పదుల సంఖ్యలో బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. ఆదివారం అతన్ని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంగిన్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం దిపూకు పంపారు. యూపీఆర్ఎఫ్ దళంలో ఎక్కువా కూకి వర్గానికి చెందిన క్యాడర్ ఉంది. దక్షిణ అస్సాం కొండ ప్రాంతాల్లో వీళ్లు నివసిస్తారు. చైనాలోని యూనన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వీళ్లు ఇటీవల మయన్మార్ మీదుగా ఆయుధాలను తెప్పించుకున్నారు. గత ఏడాది ఆ దళ చీఫ్ కమాండర్ మార్టిన్ పోలీసులు ఎన్కౌంటర్లో మృతిచెందాడు.