గువాహటి : వయోజనులకు కొత్త ఆధార్ కార్డుల జారీని నిలిపివేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కేబినెట్ గురువారం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, తేయాకు తోటల ప్రజలకు ఒక ఏడాది మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. చొరబాటుదారులు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవడాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే 18 ఏళ్ల వయసు పైబడినవారికి ఆధార్ కార్డులను జారీ చేసే అధికారాన్ని జిల్లా కమిషనర్లకు కల్పించినట్లు పేర్కొంది. సీఎం శర్మ మాట్లాడుతూ, నిరుడు బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకునేందుకు నిరంతరం కృషి చేశామన్నారు. ఏడుగురు చొరబాటుదారులను బుధవారం తిప్పి పంపించేశామని చెప్పారు. చొరబాటుదారులందర్నీ పట్టుకోగలమని చెప్పలేమని, భారత పౌరులుగా మారడాన్ని నిరోధించడం కోసం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.