Pawan Khera : అస్సాం ముఖ్యమంత్రి (Assam CM) హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) సతీమణి రిణికి భూయాన్ (Riniki Bhuyan) ఫిర్యాదు మేరకు ఆ రాష్ట్ర పోలీసులు కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera) నివాసానికి చేరుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసి విచారించేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి పోలీసులు వచ్చారు. అయితే వాళ్లు వచ్చిన సమయంలో ఖేరా ఇంట్లో లేకపోవడంతో అస్సాం పోలీసులు ఆయన కోసం అక్కడే వేచిచూస్తున్నట్లు సమాచారం.
హిమాంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్ వద్ద మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, ఆమె ఆస్తులను హిమాంత అఫిడవిట్లో వెల్లడించకుండా దాచి పెట్టారని పవన్ ఖేరా ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో హిమంత సతీమణి రిణికి భూయాన్.. ఖేరా పరువునష్టం కేసు పెట్టారు. ఆ ఫిర్యాదు మేరకు అస్సాం పోలీసులు ఢిల్లీలోని ఖేరా నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అక్కడే వేచి చూస్తున్నారు.
కాగా పవన్ ఖేరా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని హిమాంత సతీమణి రిణికి భూయాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ ఎలాంటి ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని, కానీ తనకు మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని కాంగ్రెస్ నేత నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రిణికి విమర్శించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే కాంగ్రెస్ నేతలు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.