న్యూఢిల్లీ, ఆగస్టు 11: పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ భారత్‌పై అణ్వస్త్ర హెచ్చరిక జారీచేశారు. భారత్ నుంచి తమకు హాని జరిగితే తమతోపాటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు. అమెరికాలోని తంపాలో వ్యాపారవేత్త, గౌరవ కాన్సల్ అద్నాన్ ఆసద్ ఇచ్చిన విందు సమావేశంలో మునీర్ ప్రసంగిస్తూ అణు బాంబుపై తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తమది అణ్వస్త్ర దేశమని, తాము మునిగిపోతామని భావించిన పక్షంలో తమతోపాటే సగం ప్రపంచాన్ని ముంచేస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా గడ్డపై నుంచి మూడవ దేశంపై పాకిస్థాన్ నుంచి ఇటువంటి హెచ్చరికలు రావడం ఇదే మొదటిసారి. భారత్‌తో నాలుగు రోజుల ఘర్షణ అనంతరం రెండవసారి అమెరికాను సందర్శించిన మునీర్ సిందూ నదిపై భారతదేశ నియంత్రణను కూడా తప్పుపట్టారు. సిందూ నదిపై భారత్ డ్యాం నిర్మించే వరకు వేచి చూస్తామని, డ్యాం కట్టిన తర్వాత 10 క్షిపణులతో దాన్ని పేల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. సిందూ నది భారత్ కుటుంబ ఆస్తి కాదని, తమ వద్ద క్షిపణులకు కొరత లేదని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్ మెర్సెడిస్.. పాక్ ట్రక్..
భారత్‌ను హైవేపై వస్తున్న మెర్సెడిస్తో, పాక్‌ని మట్టి లోడుతో వస్తున్న ట్రక్కుతో పోల్చిన మునీర్.. కారును ట్రక్కు ఢీకొడితే ఎవరు నష్టపోతారని ప్రశ్నించారు. భారత్ తనను తాను ప్రపంచ నాయకురాలిగా చిత్రీకరించుకుంటోందని, కాని వాస్తవం అందుకు చాలా భిన్నమని మునీర్ ఆరోపించారు. కెనడాలో సిక్కు నాయకుడి హత్య, ఖతార్‌లో ఆరుగురు భారతీయ నౌకాదళ అధికారుల అరెస్టు, కుల్‌భూషణ్ జాదవ్ కేసును ప్రస్తావిస్తూ ఈ ఘటనలన్నీ అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో భారతదేశ ప్రమేయానికి నిదర్శనాలని ఆయన ఆరోపించారు. తంపాలో అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ, సైనిక నాయకులతో భేటీ అయిన మునీర్ పాకిస్థాన్ జాతీయులతో కూడా సమావేశమయ్యారు.
భారత్ ఖండన
పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ అమెరికా గడ్డపై నుంచి చేసిన హెచ్చరికలను భారత్ సోమవారం తీవ్రంగా ఖండించింది. తమ మిత్రదేశమైన అమెరికా గడ్డపై నుంచి పాక్ సైన్యాధిపతి ఇటువంటి హెచ్చరికలు చేయడం శోచనీయమని తెలిపింది. పాకిస్థాన్‌ను అణ్యాయుధాలు కలిగిన ఉన్మాద దేశంగా అభివర్ణించిన కేంద్ర విదేశాంగ శాఖ అమెరికా అండ చూసుకుని పాక్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుందని మండిపడింది. భారత్ ఇటువంటి బెదిరింపులకు లొంగబోదని స్పష్టం చేసింది. మునీర్ వ్యాఖ్యలను భారత్ తిరస్కరిస్తోందని, ఇటువంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలను బట్టి పాక్ నిజ స్వరూపాన్ని అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది. ఉగ్రవాద సంస్థలతో కుమ్మక్కయిన సైన్యం ఉన్న దేశంలో అణ్వాయుధాల నియంత్రణపై అనుమానాలు ప్రబలుతున్నాయని భారత్ పేర్కొంది. దేశ భద్రత పరిరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం కొనసాగిస్తామని భారత్ స్పష్టం చేసింది.
భారత దౌత్యవేత్తలకు పాక్ వేధింపులు
ఇస్లామాబాద్: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లోని భారతీయ దౌత్యవేత్తలను పాకిస్థాన్ వేధిస్తున్నది. ఇండియన్ హై కమిషన్‌కు, ఇండియన్ దౌత్యవేత్తల నివాసాలకు వార్తాపత్రికల సరఫరాను నిలిపేసింది. దీనికి ప్రతీకారంగా భారత్ కూడా న్యూఢిల్లీలోని పాకిస్థానీ దౌత్యవేత్తలకు వార్తాపత్రికల సరఫరాను నిలిపేసింది. ఇస్లామాబాద్‌లోని ఇండియన్ దౌత్య కార్యాలయాలు, నివాసాల్లోకి పాకిస్థానీ అధికారులు అనధికారికంగా చొరబడి, నిఘా పెడుతున్నట్లు సమాచారం. దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ పూర్తిగా ఉల్లంఘిస్తున్నది. దౌత్యవేత్తలు, సిబ్బంది భద్రత, గౌరవ, మర్యాదలకు ఈ ఒప్పందం భరోసా ఇస్తున్నది. భారతీయ అధికారులకు సహకరించరాదని పాకిస్థానీ అధికారులు స్థానిక వ్యాపారులను ఆదేశించినట్లు తెలుస్తున్నది. దీంతో దౌత్యవేత్తలు, సిబ్బంది గ్యాస్, నీరు వంటి ముఖ్యమైన వాటి కోసం ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 2019లో పుల్వామా దాడికి ప్రతిస్పందనగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అప్పుడు కూడా ఇదే విధంగా పాకిస్థాన్ అధికారులు భారత దౌత్య సిబ్బందిని వేధించినట్లు తెలుస్తున్నది.