న్యూఢిల్లీ: ఇథియోపియాలో హైలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో.. బూడిద మబ్బులు చైనా దిశగా కదులుతున్నాయి. దట్టమైన ఆ పొగ మబ్బులు ఇప్పటికే ఇండియా చేరుకున్నాయి. అయితే ఇవాళ రాత్రి 7.30 నిమిషాల లోపు ఆ మబ్బులు ఇండియా దాటి వెళ్తాయని భారతీయ వాతావరణ శాఖ(IMD) పేర్కొన్నది. హైలీ గుబ్బి పర్వతం పేలడం వల్ల.. భారత్తో పాటు అరేబియా దేశాల్లో విమాన రాకపోకలపై ప్రభావం పడింది.
అగ్నిపర్వతం నుంచి విడుదలైన బూడిద.. గుజరాత్, ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా మీదుగా కదిలి వెళ్లనున్నట్లు ఐఎండీ చెప్పింది. బూడిద మబ్బులు చైనా దిశగా వెళ్తున్నాయని, భారత గగనతలం నుంచి రాత్రి ఏడున్నర వరకు ఆ మబ్బులు తొలిగిపోతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఇథియోపియాలోని ఎఫార్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతం ఆదివారం బద్దలైంది. ఆ పర్వత నుంచి సుమారు 45 వేల ఫీట్ల ఎత్తుకు పొగ, ధూళి కమ్ముకున్నది.
ఆ పర్వతం నుంచి తూర్పు దిశగా, ఎర్రసముద్రాన్ని దాటుతూ అరేబియన్ దీవులు, భారత్ ఉపఖండం దిశగా పొగ మబ్బులు వెళ్తున్నాయి. తీవ్రమైన గాలుల వల్ల బూడిద మబ్బులు.. ఇథియోపియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్ దిశగా కదిలాయని, ఇక అక్కడ నుంచి అరేబియా సముద్రం, పశ్చిమ, ఉత్తర భారతం దిశగా ఆ మబ్బులు వెళ్తున్నట్లు ఐఎండీ ఓ ప్రకటనలో చెప్పింది.