PM Modi | ఆసియా దేశాలు ఉమ్మడి విలువలకు కట్టుబడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఈ ఆసియాన్ సమావేశం మలేషియాలో జరుగుతండగా.. ఆ దేశ ప్రధానికి మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్దం ఆసియాన్ దేశాలదేనన్నారు. మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం తనకు స్నేహితుడని.. ఆసియాన్ కుటుంబంలో చేరడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నానన్నారు. సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు అన్వర్ ఇబ్రహీంకు అభినందనలు చెప్పారు. కొత్త సభ్య దేశంగా చేరిన తిమోర్ లెస్టేకు స్వాగతం పలికారు. థాయ్లాండ్ క్వీన్ మదర్ మరణంపై సంతాపం ప్రకటించారు. భారత్, ఆసియాన్ కేవలం భౌగోళికంగా మాత్రమే కాకుండా.. సంస్కృతి, విలువల పరంగానూ దగ్గరగా ఉన్నాయని చెప్పారు.
రెండు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలు మాత్రమే కాక ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాలు కూడా బలంగా ఉన్నాయన్నారు. ఆసియాన్ భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో కీలక స్తంభమని, ఆసియాన్ సెంట్రాలిటీని, ఇండో పసిఫిక్ దృష్టికోణాన్ని భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టమైందన్నారు. ప్రపంచంలో ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల్లో భారత్-ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నిరంతరం బలపడుతోందని మోదీ పేర్కొన్నారు. ఈ బలమైన భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి, అభివృద్ధికి మూలం అవుతోందన్నారు. ఈ ఏడాది ఆసియాన్ సదస్సు థీమ్ ‘ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ’గా ఉండడం ఉమ్మడి కృషిని ప్రతిబింబిస్తున్నదని, డిజిటల్ ఇన్క్లూజన్, ఫుడ్ సెక్యూరిటీ, సరఫరా గొలుసు స్థిరత్వం వంటి రంగాల్లో సహకారం మరింత బలోపేతమవుతుందన్నారు. సమన్వయకర్త పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించినందుకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా మాట్లాడుతూ థాయిలాండ్ రాణి తల్లి మరణంపై అన్ని భారతీయుల తరపున, థాయిలాండ్ రాజకుటుంబం, ప్రజలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు.