షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ (ఎన్ఈహెచ్యూ)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. (Shillong University) సోమవారం ఉదయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ప్రభా శంకర్ శుక్లా బంగ్లా, వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ దాడి నుంచి స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో గుర్తు తెలియని ప్రాంతానికి వీసీని పోలీసులు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, యూనివర్సిటీ అధికార దుర్వినియోగంపై విద్యార్థులు మండిపడుతున్నారు. వీసీ ప్రభా శంకర్ శుక్లా, రిజిస్ట్రార్ ఓంకార్ సింగ్, డిప్యూటీ రిజిస్ట్రార్ అమిత్ గుప్తా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో నిరాహార దీక్షలు చేపట్టారు. వర్సిటీ గేట్లను మూసివేశారు. ఫ్యాకల్టీ సంఘాలైన ఎన్ఈహెచ్యూ టీచర్స్ అసోసియేషన్, మేఘాలయ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ కూడా విద్యార్థుల నిరసనకు మద్దతిచ్చాయి. యూనివర్సిటీలో అధికార దుర్వినియోగాన్ని ఖండించాయి. పాలనా యంత్రాగాన్ని సమగ్రంగా మార్చాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు యూనివర్సిటీలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మేఘాలయ ప్రభుత్వం కేంద్రం సహాయాన్ని కోరింది. సీఎం కాన్రాడ్ సంగ్మా ఈ అంశాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.