న్యూఢిల్లీ: లోక్సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కనీసం 12 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. లోక్సభలో ఇవాళ ఆ రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. ఒకవేళ సభ్యులు అంగీకరిస్తే సమయాన్ని పొడిగిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆ బిల్లులపై ఓటింగ్ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. బిల్లులపై చర్చ చేపట్టాలా వద్దా అన్న అంశంపై సభ్యుల మధ్య డివిజన్ జరిగింది. అయితే బిల్లులపై చర్చ చేపట్టాలని 251 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 185 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బిల్లులపై చర్చ ప్రక్రియ మొదలైంది.
తొలుత ఈ బిల్లులను మోజువాణీ ఓటు ద్వారా పాస్ చేశారు. కానీ విపక్షాల అభ్యంతరం నేపథ్యంలో మళ్లీ విభజన చేసి ఓటింగ్ నిర్వహించారు. 251 మంది అనుకూలంగా ఓటు వేయడంతో.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ ప్రక్రియకు చెందిన రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులను కలిపి సభలో ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ నేత వేణుగోపాల్ వ్యతిరేకించారు. రెండు బిల్లులను కలపడం మంచి విధానం కాదు అని, దీని వల్ల పరిణామాలు ఉంటాయని, ఒకవేళ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి పాలైతే, అప్పుడు దీంట్లో అర్థం ఏం ఉంటుందని వేణుగోపాల్ అన్నారు. రాజ్యాంగ సవరణకు, ఓ చట్టం సవరణకు జరిగే ఓటింగ్లో తేడా ఉంటుందని అమిత్ షా అన్నారు. ఒకటిపై ఒకటి ఆధారపడి ఉండడం వల్ల బిల్లులను కలిపి ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. 15 నుంచి 18 గంటలు లేదా మీకు వీలైనంత సమయం చర్చించవచ్చు అని స్పీకర్ తెలిపారు.