ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనతో జరిపిన వాట్సాప్ చాట్స్‌ను (WhatsApp chats) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాజీ అధికారి సమీర్ వాంఖడే బయటపెట్టారు. 2021 అక్టోబర్ 3న షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆయన అరెస్ట్ చేశారు. అయితే అతడి విడుదల కోసం షారుఖ్‌ను రూ.25 కోట్లు సమీర్ వాంఖడే డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాంఖడేపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసును కొట్టివేయాలని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించేందుకు వాంఖడే ప్రయత్నించారు. షారుఖ్ ఖాన్, తనకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లను కోర్టుకు సమర్పించారు. దీంతో సోమవారం వరకు వాంఖడేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు పేర్కొంది.
కాగా, ఈ వాట్సాప్ చాట్స్ ప్రకారం.. దయచేసి తన కుమారుడి పట్ల కఠినంగా వ్యవహరించవద్దని, అతడ్ని జైలుకు తరలించవద్దని, ఇంటికి పంపాలంటూ వాంఖడేను షారుఖ్ ఖాన్ వేడుకున్నారు. అలాగే తన కుమారుడ్ని తప్పుడు కేసులో ఇరికించిన వారి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడతానని అన్నారు. తన పట్ల, తన కుటుంబం పట్ల జాలి చూపాలని, నేరస్తులున్న జైలులో ఉంచ వద్దని, తన కుమారుడి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయవద్దని ఒక తండ్రిగా వేడుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. అలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత చేసిన వాట్సాప్ చాటింగ్‌పై వాంఖడేకు క్షమాపణలు కూడా చెప్పారు.
మరోవైపు ఒక తండ్రిగా ఆయన బాధను అర్థం చేసుకున్నానని, అంతా మంచే జరుగుతుందని ఆ అధికారి భరోసా ఇచ్చారు. షారుఖ్ ఖాన్, సమీర్ వాంఖడే మధ్య జరిగిన ఈ వాట్సాప్ స్క్రీన్ షాట్లు మీడియాకు లీక్ అయ్యాయి.
…
…
…
…
…
…