ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్( Aryan Khan ).. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో ఏడుస్తూనే ఉన్నాడని అధికారులు తెలిపారు. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో జరిగిన ఓ రేవ్ పార్టీపై దాడి చేసిన ఎన్సీబీ అధికారులు అతనితోపాటు పలువురు ఇతర ప్రముఖుల పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం రాత్రి ఈ దాడులు జరగగా.. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆర్యన్‌ను ఎన్సీబీ ప్రశ్నించింది. సాయంత్రం అతన్ని అరెస్ట్ చేసింది.
ఈ విచారణలో ఆర్యన్ గత నాలుగేళ్ల నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలిందని ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. అతడు యూకే, దుబాయ్, ఇతర దేశాలలో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకుంటూనే ఉండేవాడని చెప్పారు. ఆదివారం మొత్తం 8 మందిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. కార్డెలియా క్రూయిజ్ షిప్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఆర్యన్‌తోపాటు అతని స్నేహితుడు అర్బాజ్, మరో ఆరుగురిని ఎన్సీబీ సాయంత్రం అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తరలించింది.
ఆదివారం ఆర్యన్, అర్బాన్, మున్మున్లను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. సోమవారం వరకూ వాళ్లకు ఎన్సీబీ కస్టడీ విధించారు. ఆర్యన్‌పై సెక్షన్ 27 (నార్కోటిక్ డ్రగ్ వినియోగించినందుకు శిక్ష), 8సీ (డ్రగ్స్ తయారీ, ఉత్పత్తి, కలిగి ఉండటం, అమ్మడం లేదా కొనడం)తోపాటు ఇతర నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.