న్యూఢిల్లీ : ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసు దర్యాప్తు అధికారి సమీర్ వాఖండేపై ఎన్సీబీ బదిలీ వేటు వేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో దర్యాప్తు అధికారిగా పని చేసిన విషయం తెలిసిందే. సమీర్ వాంఖేడ్ను చెన్నైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లో టాక్స్‌పేయర్ సర్వీస్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఇది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్. ఇంతకు ముందు ఆయన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి ముంబై కార్యాలయానికి జోనల్ డైరెక్టర్‌గా కొనసాగారు.
గత అక్టోబర్‌లో సమీర్ వాంఖడే ముంబై తీరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి ఆర్యన్ ఖాన్ సహా మరో 22 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత వాంఖడేపై అవినీతి ఆరోపణలు, కేసు దర్యాప్తులో లోపాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో డ్రగ్స్ కేసు ముంబై జోన్ నుంచి ఎన్సీబీ.. కేంద్ర బృందానికి బదిలీ చేయడంతో పాటు వాంఖడేను ఆర్యన్ ఖాన్ కేసు దర్యాపు నుంచి తొలగించింది. ఇదిలా ఉండగా.. డ్రగ్ కేసులో వాంఖడేపై విజిలెన్స్ విచారణ జరిపారు. ఎన్సీబీ ఆర్యన్ ఖాన్‌పై అన్ని మాదకద్రవ్యాల ఆరోపణలను క్లియర్ చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఎన్సీబీ పేర్కొంది.
విచారణలో లోపభూయిష్టంగా వ్యవహరించినందుకు, విధివిధానాలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఆర్యన్ ఖాన్ కేసులో సజావుగా దర్యాప్తు చేయని సమీర్ వాంఖడేపై చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సమీర్ వాంఖడే నేతృత్వంలోని మొదటి దర్యాప్తు బృందంలో పొరపాటు జరిగిందని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆయన నకిలీ కుల ధ్రువీకరణ సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సైతం విచారణ జరుపనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.