చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 11న సంగ్రూర్ జిల్లా ధూరిలో ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ నిర్వహించే జన్ సభకు ఆమె హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. భగవంత్ మాన్ తల్లి, సోదరితో పాటు ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ కుమార్తె కూడా పాల్గొంటారు. పంజాబ్‌లో తన ప్రచార కార్యక్రమం గురించి సునీతా కేజ్రీవాల్ గురువారం ట్వీట్ చేశారు.
భగవంత్ మాన్కు మద్దతుగా రేపు ధూరిలో జరిగే జన్ సభలో కుమార్తెతో కలిసి పాల్గొంటానని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. ఫోన్‌లైన్ సర్వేలో 93 శాతం మంది అనుకూలంగా ఓటు చేయడంతో భగవంత్ మాన్‌ను ఆప్ తమ సీఎం అభ్యర్ధిగా జనవరి 18న ప్రకటించిన సంగతి తెలిసిందే. మాన్ ధూరి నియోజకవర్గం నుంచి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. పంజాబ్‌లోని 117 నియోజకవర్గాల్లో ఈనెల 14న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇక పంజాబ్ పోరులో గెలుపొంది మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, కాంగ్రెస్ సర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి రావాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చెమటోడుస్తోంది. సాగు చట్టాలపై పోరుతో బలపడిన అకాలీదళ్ ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇస్తుండగా కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్‌తో పొత్తుతో సత్తా చాటేందుకు బీజేపీ సంసిద్ధమైంది.