Arvind Kejriwal | అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రెండురోజుల్లో రాజీనామా చేస్తానంటూ అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ ఎన్నికలు సైతం నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ప్రజల తన నిజాయితీకి సర్టిఫికెట్ ఇచ్చే వరకు సీఎం పదవిలో కూర్చోబోనన్నారు. త్వరలోనే శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నామని.. ఇందులో కొత్త సీఎం పేరుపై ఏకాభిప్రాయం వస్తుందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా 2013లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలిసారి 49 రోజులకే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. అవినీతిని అరికట్టేందుకు కేజ్రీవాల్ అసెంబ్లీలో జన్ లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టారు.
ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. బిల్లుకు తొలుత కేంద్రం మద్దతు తెలుపాలని బీజేపీ, కాంగ్రెస్ పేర్కొన్నాయి. అయితే, ఈ బిల్లును మొదట అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేజ్రీవాల్ పట్టుబట్టారు. బిల్లుకు అనుకూలంగా అవసరమైన మద్దతు కూడగట్టలేకపోయారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది ఎమ్మెల్యేల్లో 42 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆయన రాజీనామా చేశారు. దేశం కోసం సీఎం పదవిని ఒక్కసారి కాదు వందసార్లయినా కాదనగలననని రాజీనామా సందర్భంగా కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ రాజీనామా అనంతరం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. 2015లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి విజయాన్ని నమోదు చేసి.. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 70 అసెంబ్లీ స్థానాల్లో 67 చోట్ల గెలిచి ఆప్ పార్టీ భారీ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 2022లో పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ భారీ విజయాన్ని అందుకున్నది.
కేజ్రీవాల్ 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు ఇండియన్ రెవెన్యూ సర్వీసులో సేవలందించారు. ఆయన స్వస్థలం హర్యానా. 1985లో ఐఐటీ జేఈఈ పరీక్ష రాసి 563 ఆల్ ఇండియా ర్యాంకు సాధించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మెకానికల్ ఇంజినీర్లో పట్టభద్రుడయ్యారు. 1989లో తొలిసారిగా టాటాస్టీల్‌లో ఉద్యోగంలో చేరారు. బిహార్ జంషెడ్‌పూర్‌లో పని చేశారు. 1992లో సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యేందుకు సెలవులు తీసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొంతకాలం కలకత్తాలో గడిపారు. అక్కడ ఆయన మదర్ థెరిసాను కలిశారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ, రామకృష్ణ మిషన్, నెహ్రూ యువ కేంద్రంలో స్వచ్ఛందంగా పని చేశారు. 1995లో సివిల్ సర్వీసెస్‌కు అర్హత సాధించి.. ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో ఇన్‌కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా నియామకమయ్యారు. ఆదాయపు పన్నుశాఖలో పని చేస్తున్న సమయంలోనే మనీష్ సిసోడియాతో కలిసి ఢిల్లీలో సుందర్ నగర్ ప్రాంతంలో పరివర్తన్ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. దీని ఉద్దేశం అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం. పరివర్తన్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించేందుకు ఆయన కొలువకు రాజీనామా చేశారు.
సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి.. అవినీతికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి ఆయనకు మెగసెసే అవార్డు లభించింది. ఈ సందర్భంగా ‘పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఆ తర్వాత అన్నా హజారేతో కలిసి జన్ లోక్‌పాల్ బిల్లు కోసం కలిసి పోరాడారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పారు. పార్టీని స్థాపించిన తక్కువ సమయంలోనే అధికారాన్ని చేపట్టారు. ఆయన స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం భారత రాజకీయాల్లో ప్రధాన శక్తిగా మారింది. దేశ రాజధాని ఢిల్లీ కాకుండా పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీట్లను సాధించింది. గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్.. మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో ఈడీ ఆయనను అరెస్టు చేసింది.
జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం రెండు కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్ ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు పలు షరతులు విధించింది. సీఎం ఆఫీసు వెళ్లకూడదని.. అధికారిక దస్త్రాలపై సంతకాలు చేయొద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చిన కేజ్రీవాల్.. చివరకు అవినీతి కేసులో అరెస్టు కావడం ఆయన ప్రతిష్టను దిగజార్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, మద్యం పాలసీ కేసులో కేవలం కల్పితమని ఆమ్ ఆద్మీ వర్గాలు పేర్కొంటున్నాయి.