న్యూఢిల్లీ, నవంబర్ 10: తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని చూసి బీజేపీ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోను ప్రస్తావిస్తూ.. ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుందని ప్రశ్నించారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘ఢిల్లీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుట్ర జరుగుతున్నది. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ నిర్వహిస్తున్నారు.
మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.25 కోట్ల చొప్పున ఆఫర్ చేస్తున్నారు. సాక్ష్యమేది? అని మీరు (మీడియా) అడుగుతున్నారు. మీరు అలా అడుగుతుంటే మేమే నేరం చేసినట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు సాక్ష్యాలు లభించాయి కదా. తెలంగాణలో ముగ్గురు దొరికిపోయారు కదా. తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి వెళ్లారు. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయారు. అందులో వారే స్పష్టంగా చెప్తున్నారు ఢిల్లీలో 41 మంది ఎమ్మెల్యేలు తమ టచ్‌లో ఉన్నారని. ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇవ్వజూపుతున్నట్టు వాళ్లే స్వయంగా చెప్తున్నారు.
మీ దగ్గరకు రాలేదా?’ అని అన్నారు. దీనికి బదులిచ్చిన ఎన్డీటీవీ ప్రతినిధి.. ఆ వీడియోను తాము ప్రసారం చేశామని, కేసీఆర్ సాబ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ప్రసారం చేశామని వివరించారు. దీంతో ‘తెలంగాణలో వీళ్ల(బీజేపీ) పార్టీ వాళ్లు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర చూపుతున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలను అమిత్‌షాతో భేటీ చేయిస్తామని హామీ ఇచ్చారు. నడ్డాతో భేటీ చేయిస్తామన్నారు. ఇప్పుడంటే ఇప్పుడు, ఎక్కడంటే అక్కడ పేమెంట్ చేస్తామన్నారు. ఢిల్లీలో త్వరలోనే ప్రభుత్వం పడిపోబోతున్నదని చెప్పారు. 41 మంది ఎమ్మెల్యేలను తమ వైపు రప్పించుకొన్నామని అన్నారు. మీరు సాక్ష్యాధారాలు అడుగుతున్నారు కదా.. ఇంతకంటే సాక్ష్యం ఏమున్నది?’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.