Arvind Kejriwal : కేంద్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత కరెంట్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. పొరుగు దేశం చైనా అక్రమించిన భారత సరిహద్దు ప్రాంతానికి విముక్తి కలిగిస్తామని చెప్పారు.
అయితే ఈ 10 గ్యాంరటీలపై ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో తాను చర్చించలేదని ఈ సందర్భంగా కేజ్రీవాల్ తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఈ గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. తాను జైలు నుంచి విడుదల కావడం ఆలస్యమైందని.. ఇప్పటికే పలు దశల పోలింగ్ జరిగి పోయిందని ఆయన విచారం వ్యక్తంచేశారు.
1. దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందిస్తాం. అలాగే 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తాం.
2. ప్రైవేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా మరింత మెరుగైన విద్య అందిస్తాం.
3. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం.
4. చైనా ఆధీనంలో ఉన్న భారత భూభాగాన్ని విముక్తి చేస్తాం. అందుకోసం ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తాం.
5. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్ని వీర్ పథకాన్ని రద్దు చేస్తాం.
6. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తాం.
7. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా తీసుకువస్తాం.
8. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం.
9. దేశంలోని అవినీతిని పారదోలుతాం. భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా మారుస్తాం.
10. జీఎస్టీని సరళీకరిస్తాం.