న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కోసం ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం యమునా నది (Yamuna River) తీరాన ఓ కృత్రిమ ఘాట్‌ను ఏర్పాటుచేసింది. ఛఠ్ ఉత్సవాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఢిల్లీలోని వివిధ ఘాట్లను పరిశీలించారు. వాసుదేవ్ ఘాట్‌కు సమీపంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రధాని మోదీ మునగడం కోసం ఓ ఘాట్‌ను ఏర్పాటుచేసి, అందులో ఫిల్టర్ వాటర్ నింపిందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. యమునా నది ప్రక్షాళనను ఆప్ వ్యతిరేకిస్తున్నదని మండిపడింది. ఐఎస్బీటీకి సమీపంలో ఏర్పాటుచేసిన ఈ కృత్రిమ ఘాట్‌ను ఆప్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..యమునా నది తీరాన బీజేపీ కృత్రిమంగా ఓ కుంటను ఏర్పాటు చేసి, దానిని వజీరాబాద్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఫిల్టర్ వాటర్‌తో నింపిందని ఆరోపించారు. బీహార్, పూర్వాంచల్ నుంచి వచ్చే భక్తులను మోసం చేసేందుకు బీజేపీ ఇంతకు దిగజారిందని మండిపడ్డారు. తూర్పు కాలువ ద్వారా యూపీలోని రైతులకు నీరు అందకుండా చేసి, ఆ నీటిని యమునా నదిలోకి మళ్లించారని చెప్పారు. యమునా నదిలో స్నానం చేస్తే తీవ్రమైన వ్యాధులు వస్తాయని ఢిల్లీ కాలుష్య నియంత్ర కమిటీ ఇటీవలనే హెచ్చరించిందని గుర్తుచేశారు. బీహారీల ఓట్ల కోసమే బీజేపీ ఈ నాటకమాడుతున్నదని విమర్శించారు.