AGI | న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆధునిక సాంకేతికతల్లో ఒకటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శరవేగంగా పురోగమిస్తున్నది. భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారుతుందన్న భయాందోళనలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. ఆ రోజులు త్వరలోనే రాబోతున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. 2030 నాటికి ఏఐ మరింత అభివృద్ధి చెందుతుందని, మానవులతో సమానమైన తెలివితేటలు కలిగిన కృత్రిమ మేధస్సుగా పిలిచే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)గా రూపాంతరం చెంది మానవాళిని శాశ్వతంగా నాశనం చేస్తుందని ‘గూగుల్ డీప్‌మైండ్’ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది.
అయితే ఈ ముప్పు ఎలాంటిదో, మానవాళి మనుగడకు ముప్పు ఎలా వస్తుందో వెల్లడించలేదు. ఏజీఐ వల్ల ఎదురయ్యే ప్రమాదాలను ఈ అధ్యయనం 4 ప్రధాన క్యాటగిరీలుగా విభజించింది. ఏజీఐతో సమాచార దుర్వినియోగం (డాటా మిస్ యూజ్), మిస్ అలైన్మెంట్, మిస్టేక్స్, స్ట్రక్చరల్ రిస్క్స్ లాంటి ప్రమాదాలు ఉన్నాయని ఈ పరిశోధనా పత్రం సహ రచయిత, ‘డీప్‌మైండ్’ సహ వ్యవస్థాపకుడు షేన్ లెగ్ స్పష్టం చేశారు. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు గూగుల్, ఇతర ఏఐ కంపెనీలు తగిన నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
కృత్రిమ మేధస్సును నియంత్రణలో ఉంచడంపైనే ఈ పరిశోధనలో దృష్టి కేంద్రీకరించామని, దాని వల్ల ఎదురయ్యే ముప్పుపై లోతుగా అధ్యయనం చేశామని చెప్పారు. కాగా, మనుషుల కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన ఏజీఐ రాబోతున్నదని, వచ్చే 5 నుంచి 10 ఏండ్లలో దీని ఆవిర్భావం ప్రారంభం కావచ్చని ‘డీప్‌మైండ్’ సీఈవో డెమిస్ హస్సాబిస్ రెండు నెలల క్రితమే స్పష్టం చేశారు. ఏజీఐ అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన ఉద్ఘాటించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐకి మరో ముందడుగే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఏఐ అనేది టాస్క్ స్పెసిఫిక్‌గా ఉంటుంది. అంటే మనం ఇచ్చిన పనులను మాత్రమే చేయగలుగుతుంది. కానీ, ఏజీఐ అనేది మానవ మేధస్సు మాదిరిగా అనేక రకాల పనుల నిర్వహణకు అవసరమైన తెలివితేటలను కలిగి ఉండేలా లక్ష్యాలను పెట్టుకుంటుంది. స్పష్టంగా చెప్పాలంటే ఇది మనుషుల మాదిరిగా విభిన్న డొమైన్లలోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని, నేర్చుకోవడంతోపాటు ఆ జ్ఞానాన్ని రకరకాల పనుల కోసం అన్వయించగలిగే ఓ యంత్రం.