బెంగళూరు, మే 30: ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నైరుతి పవనాలు రాక ఆలస్యమైంది. రుతు పవనాల ప్రారంభాన్ని నిర్ధారించే అంశాలు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఐఎండీ తెలిపింది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు మాట్లాడుతూ గాలుల సరళి సంతృప్తికరంగా లేదని తెలిపారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వేడి, పొడి వాతావరణం, రుతు పవనాలకు ముందు కురిసే వర్షాలకు అంతరాయం కలగడం కూడా రుతు పవనాల రాకను ప్రభావితం చేశాయని వారు చెప్పారు. పశ్చిమ గాలులు 4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోవాల్సి ఉండగా ప్రస్తుతం అవి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులోనే ఉన్నాయని ఐఎండీ-బెంగళూరు డైరెక్టర్-ఇన్చార్జ్ ఎన్ పువియరసన్ తెలిపారు. కేరళలో వర్షాలు కురుస్తున్నప్పటికీ అవి రుతు పవనాలకు ముందు కురిసే జల్లులేనని ఆయన చెప్పారు.
‘దీర్ఘకాల సగటు అంచనా ప్రకారం రుతు పవనాల ఆరంభానికి ఆదర్శవంతమైన తేదీ జూన్ 1. కానీ ఈ ఏడాది రుతుపవనాలు మే 26-27 తేదీలలో వస్తాయని అంచనా వేశారు. అయితే ఇప్పుడు అది ఆలస్యమైంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జూన్ 1న కూడా రుతు పవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా లేవు’ అని ఆయన అన్నారు. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, చుట్టుపక్కల ప్రాంతాలను ఆవరించాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఇది ముందుకు సాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ప్రధాన భూభాగానికి దీని రాక గురించి ప్రస్తుతానికి చెప్పలేమని ఆయన అన్నారు. అయితే రుతు పవనాలకు ముందు కురిసే వర్షాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.