Arrest : భారత సైనిక దళాల (Indian Army) కదలికలకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని, ఫొటోలను పాకిస్థాన్ (Pakistan) కు చేరవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్ (Punjab) లో అరెస్ట్ చేశారు. అమృత్‌సర్‌కు చెందిన పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్లు భారత సైన్యం రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందజేస్తున్నారని దర్యాప్తులో తేలడంతో అమృత్సర్ రూరల్ పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు.
ఆ ఇద్దరు ఇంటి దొంగలు పాకిస్థాన్‌లోని ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు సమాచారం ప్రకారం.. హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ సూచనల మేరకు వీరు పని చేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం హర్‌ప్రీత్ సింగ్ అమృత్సర్ జైల్లో ఉన్నాడు. అరెస్టైన నిందితుల దగ్గర అత్యంత సున్నితమైన విజువల్స్తోపాటు, డేటా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికార రహస్యాల చట్టం కింద వీరిపై కేసులు పెట్టారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని అరెస్టులు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.