Arrest : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద చేపట్టిన పనుల్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. వేయని రోడ్లు (Roads) వేసినట్లుగా, చేయని పనులు (Works) చేసినట్లుగా, తీసుకోని మెటీరియల్ (Material) తీసుకున్నట్లుగా చూపించి ప్రభుత్వం నుంచి అక్రమంగా బిల్లులు తీసుకున్నారు. మంత్రి కుమారుడితో స్థానిక అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు రూ.71 కోట్ల టోకరా వేశారు. రహదారుల అభివృద్ధి సంస్థ (RDA) అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ మంత్రి బాచుభాయ్ ఖబాడ్ కుమారుడు బల్వంత్ ఖబాడ్.. ప్రభుత్వ అధికారులతో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి భారీ కుంభకోణానానికి పాల్పడ్డారు. రహదారి నిర్మాణ పనులు చేయకున్నా చేసినట్లుగా చూపించి, మెటీరియల్ కొనకపోయినా కొన్నట్లుగా చూపించి 2021 నుంచి 2024 మధ్య మొత్తం రూ.71 కోట్లు కొల్లగొట్టారు. ఆర్డీఏ అధికారుల తనిఖీల్లో ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు కాంట్రాక్టర్లను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇవాళ మంత్రి కుమారుడు బల్వంత్ ఖబాడ్ను, అప్పటి టీడీవో దర్శన్ పటేల్‌ను అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. మరికొందరు ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు కూడా ఈ కుంభకోణంలో అరెస్టయ్యే అవకాశం ఉంది.