Ayodhya | అయోధ్య, డిసెంబర్ 29: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గర్భగుడిలో ఏ విగ్రహం ప్రతిష్ఠిస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రతిష్ఠాపన కోసం మొత్తం మూడు విగ్రహాలను తయారు చేయగా.. వాటిలోంచి ఓ విగ్రహాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మౌఖిక ఓటింగ్ ద్వారా ఓ విగ్రహాన్ని ఎంపిక చేసినట్టు తెలిసింది. 51 అంగుళాల ఎత్తుతో ఐదేండ్ల బాలుడి రూపంలో విగ్రహం ఉండనుంది. 35 అడుగుల దూరం నుంచి భక్తులు దర్శించుకోవచ్చు. వచ్చే నెల 22న విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉండే బాల రాముడి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు. అందులోంచి ఒక దానిని తాజాగా ఎంపిక చేశారు. అయితే విగ్రహం ఎంపిక పూర్తయినప్పటికీ దీనిపై పలువురి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే దాని రూపాన్ని బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటివరకు ఉన్న పాత విగ్రహాన్ని అచల మూర్తిగా వ్యవహరిస్తుండగా, కొత్త విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా పిలుస్తారు.
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు రామ్ మందిర్ ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జనవరి 22న రామ్‌లాలా (బాల రాముడి విగ్రహం) విగ్రహాన్ని రామమందరంలో ప్రతిష్ఠించేందుకు ఏడు రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నది. ఈ కార్యక్రమాలు జనవరి 16న ప్రారంభమై, ప్రతిష్ఠాపన జరిగే వరకు కొనసాగుతాయి. ఏయే రోజు ఏయే కార్యక్రమం నిర్వహిస్తున్నదీ వివరాలతో ట్రస్టు ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా అయోధ్యలో రూ.15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
జనవరి 16: వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత్ హోమం, దశవిద్ స్నానం
జనవరి 17: అయోధ్యలో రామ్ లల్లా విగ్రహంతో ఊరేగింపు
జనవరి 18: గణేశ్ అంబికా, వరుణ, వాస్తు తదితర పూజా కార్యక్రమాలు
జనవరి 19: అగ్ని స్థాపన, నవగ్రహ స్థాపన
జనవరి 20: సరయూ నది పవిత్ర జలంతో ఆలయ గర్భగుడి సంప్రోక్షణ
జనవరి 21: 125 కలశాలతో దివ్య స్నానం
జనవరి 22: రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పవిత్ర జలం రానున్నది. పీవోకేలోని శారద పీఠం ఆలయ ప్రాంగణంలోని సరస్సు నుంచి ఈ జలాన్ని సేవ్ శారద కమిటీ-కశ్మీర్ బృందం తీసుకురానున్నది.
అయోధ్య రామాలయం వచ్చే ఏడాది జనవరి 22న ప్రారంభమవుతుంది. అయితే రామాలయంలో ప్రాణప్రతిష్ఠకు ముందు రోజు దేవాలయంలో శ్రీరాముని హారతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారికి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైంది. భక్తులు రామజన్మభూమి ఆలయ వెబ్సైట్లో ముందుగా తమ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత అయోధ్యలోని ఆలయ కౌంటర్లో పాస్‌లు తీసుకోవాలి. భక్తులు తమ ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించవచ్చు. రోజుకు మూడుసార్లు మాత్రమే జరిగే ఈ హారతిలో గరిష్ఠంగా 30 మంది మాత్రమే పాల్గొనవచ్చు.
అయోధ్య రామాలయంలో అద్భుతమైన కళాకృతితో నిర్మితమైన కట్టడం