కోల్కతా, జూలై 29: పశ్చిమబెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కేసులో పార్థఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసాలపై ఈడీ సోదాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే అర్పితకు చెందిన రెండు ఇండ్లపై జరిపిన దాడుల్లో రూ.50 కోట్లకు పైగా నగదు, 5 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు..తాజాగా ఆమెకు చెందిన మరో ఫ్లాట్లో కూడా సోదాలు జరిపారు. కోల్కతాలోని చినార్ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లో గురువారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ ఇంట్లో కూడా భారీగా డబ్బును గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అర్పిత ముఖర్జీకి చెందిన 4 కార్ల కోసం ఈడీ అధికారులు వెతుకులాట ప్రారంభించారు. ఆడి-ఏ4, హోండాసిటీ, హోండా సీఆర్వీ, మెర్సిడెజ్ బెంజ్ కార్లలో పెద్దయెత్తున డబ్బు నింపి ఇతర ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. వాహనాలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించడంతోపాటు తనిఖీలు చేపడుతున్నారు. కాగా, కస్టడీలో ఉన్న పార్థఛటర్జీ, అర్పిత ముఖర్జీలను ఈడీ అధికారులు శుక్రవారం మెడికల్ చెకప్ కోసం కోల్కతాలోని ఈఎస్ఐ దవాఖానకు తీసుకెళ్లారు.