చండీగఢ్: ఆర్మీ మేజర్, 16 మంది జవాన్లపై సుమారు 35 మంది దాడి చేశారు. (Army Major, jawans attacked) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ధాబా యజమానితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం వెతుకుతున్నారు. పంజాబ్‌లోని రోపార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లడఖ్ స్కౌట్స్‌కు చెందిన మేజర్ సచిన్ సింగ్ కుంతల్, 16 మంది సైనికులు ఆదివారం లాహౌల్‌లో జరిగిన స్నో మారథాన్‌లో పాల్గొని విజయం సాధించారు. అనంతరం తిరిగి వస్తున్న వారు సోమవారం రాత్రి వేళ మనాలి-రోపర్ రహదారిలోని భరత్‌ఘడ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ‘ఆల్పైన్ ధాబా’ వద్ద ఫుడ్ కోసం ఆగారు.
కాగా, ఆహారం తిన్న తర్వాత యూపీఐ ద్వారా బిల్లు చెల్లిస్తామని ఆర్మీ మేజర్, జవాన్లు తెలిపారు. అయితే క్యాష్ ఇవ్వాలని ధాబా యజమాని డిమాండ్ చేశాడు. ఆర్మీ మేజర్ ఆన్లైన్లో బిల్లు చెల్లించడంతో ధాబా యజమాని వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో ధాబాకు చెందిన సుమారు 35 మంది వ్యక్తులు ఆర్మీ మేజర్, 16 మంది జవాన్లపై దాడి చేశారు. ముఖంపై పంచ్‌లు ఇవ్వడంతో పాటు కర్రలు, ఇనుప రాడ్లతో వారిని కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఈ దాడిలో ఆర్మీ మేజర్ తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్మీ మేజర్, సైనికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాబా యజమాని, మేనేజర్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.