Army chief @ Tawang | ఇండియన్ ఆర్మీ చీఫ్ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో భద్రతకు సంబంధించిన సన్నాహాలను పరిశీలించారు. సరిహాద్దులోని ఇండియన్ పోస్టులను సందర్శించారు. భారత జవాన్ల అంకితభావాన్ని ఆయన మెచ్చకున్నారు. తవాంగ్‌లో చైనా సైనిక దళాలతో భారత సైన్యం తలపడిన ఆరు వారాల తర్వాత భారత్ సైన్యాధికారి అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.
చైనా జవాన్లను భారత భూభాగంలోకి రాకుండా అడ్డుకున్న 43 రోజుల అనంతరం ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే అరుణాచల్‌ప్రదేశ్‌కు వచ్చారు. లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద ఉన్న భారత్‌కు చెందిన పోస్ట్‌లను సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న జవాన్లతో మాట్లాడారు. సరిహద్దులో భద్రత సన్నాహాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇక్కడ విధుల్లో ఉన్న భారత ఆర్మీ అకింతభావం, అప్రమత్తత, కర్తవ్యం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో కూడా ఇదే విధంగా భద్రత చర్యలు కొనసాగిస్తారని ఆశిస్తున్నానని వారితో చెప్పారు. ఈ సందర్భంగా మనోజ్ పాండే మీడియాతో మాట్లాడుతూ, సరిహద్దులో తలెత్తిన ఏడు విషమ సమస్యల్లో ఐదింటిని పరిష్కరించినట్లు చెప్పారు. ఇప్పటికైతే సరిహద్దులో పరిస్థితి అదుపులోనే ఉన్నదని, అయితే, ఎప్పుడైనా అనూహ్యంగా మారే అవకాశాలుంటాయన్నారు.
గత ఏడాది డిసెంబర్ 9 వ తేదీన చైనా సైనికులు తవాంగ్ ప్రాంతంలో మన భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని ఇండియన్ ఆర్మీ జవాన్లు సమర్ధంగా అడ్డుకున్నారు. 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న యాంగ్ట్సే వద్ద భారత్ పోస్టును తొలగించేందుకు చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చొరబాటుకు యత్నించారు. వీరిని మన సైనికులు తిప్పికొట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చేలరేగింది. ఈ ఘర్షణలో ఆరుగురు భారత సైనికులు గాయపడ్డారు. పలువురు చైనా జవాన్ల ఎముకలు విరిగిపోయినట్లు సమాచారం.