న్యూఢిల్లీ, జూలై 26: రక్షణ బలగాల కోసం రూ.28,732 కోట్ల విలువైన డ్రోన్లు, అధునాతనమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కార్బైడ్లను కేంద్రం కొనుగోలు చేయనున్నది. ఈ ప్రతిపాదనలకు రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి (డీఏసీ) ఆమోదం తెలిపింది. మంగళవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి పెరుగుతున్న శత్రువుల ముప్పును ఎదుర్కొనేందుకు ఈ కొనుగోళ్లు అవసరమని తెలిపారు. అలాగే ఉగ్రవాద నిర్మూలనకు భద్రతా బలగాలకు ఇవి చాలా కీలకమని చెప్పారు. భారతీయ బీఐఎస్-6 నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా ఇవి ఉంటాయని వెల్లడించారు. 4లక్షల కార్బైన్లనూ కొనుగోలు చేయనున్నామని, రక్షణ రంగంలో చిన్న కంపెనీల ‘ఆత్మ నిర్భరత’కు ఈ కొనుగోళ్లు ఊతమిస్తాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.