Bank Robbery : మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో భారీ చోరీ జరిగింది. సింగ్రౌలీ జిల్లా (Singrauli district) బైదాన్ పట్టణంలోని వింద్యానగర్ ఏరియా (Vindyanagar) లోగల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharastra) బ్రాంచ్లో దోపిడీ దొంగలు చొరబడి నగదుతోపాటు లాకర్లలోని బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. రూ.15 కోట్ల విలువైన బంగారం, రూ.35 లక్షల నగదు, వెండితో వారు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ఐదుగరు దుండగులు బ్యాంకులో చొరబడి బ్యాంకు సిబ్బందిని, వినియోగదారులను తుపాకులతో బెదిరించి బంధించారు. అనంతరం కేవలం 20 నిమిషాల్లోనే బంగారం, వెండి, నగదుతో ఉడాయించారు. మొదట ఇద్దరు దొంగలు కస్టమర్లలా నటిస్తూ.. బ్యాంకులోకి ప్రవేశించారు. వారు తుపాకులు తీసి సిబ్బందని, కస్టమర్లను బెదిరిస్తుండగా.. మరో ముగ్గురు దొంగలు బ్యాంకులో చొరబడ్డారు.
సిబ్బంది, కస్టమర్లు అందరూ తమ మొబైల్స్ ఒకేదగ్గర పెట్టాలని ఆదేశించారు. అందుకు కొందరు నిరాకరించడంతో గాల్లోకి కాల్పులు జరిపి బెదిరించారు. అందరి ఫోన్లు తీసుకున్న తర్వాత కస్టమర్లను, సిబ్బంది గోడవైపు ముఖాలు చేసి కూర్చోవాలని ఆదేశించారు. కదిలినా, మాట్లాడినా చంపేస్తామని బెదిరించారు. ఆ సమయంలో తనకు రావడంతో దగ్గానని, అయితే ‘దగ్గితే చంపేస్తాం’ అని దొంగలు వార్నింగ్ ఇచ్చారని ఓ కస్టమర్ చెప్పారు.
దోపిడీ సమయంలో ఒక దొంగ బ్యాంకు గేటు దగ్గర నిలబడగా, మరో ఇద్దరు బ్యాంకులోపల కస్టమర్లకు తుపాకీ గురిపెట్టి నిలబడ్డారు. మరో ఇద్దరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లి లాకర్ల తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో చెంపపై కొట్టి తాళాలు లాక్కున్నారు. భారీ విలువైన నగలు, నగదుతో ఉడాయించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసులు బృందాలుగా ఏర్పడి మధ్యప్రదేశ్తోపాటు దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా దోపిడీ దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.