న్యూఢిల్లీ: మణిపూర్ రాష్ట్రవ్యాప్తంగా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) మరో ఆరు నెలలపాటు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. రాష్ట్రంలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిని ఈ చట్టం నుంచి మినహాయించినట్లు తెలిపింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కల్లోలిత ప్రాంతాల్లో పనిచేసే సాయుధ దళాల సిబ్బందిపై ఆరోపణలు వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే విచారణ జరపరాదని ఈ చట్టం చెప్తున్నది.
ఈ చట్టాన్ని నాగాలాండ్‌లోని 8 జిల్లాలకు, మరో ఐదు జిల్లాల్లోని 21 పోలీస్ స్టేషన్ల పరిధులకు మరో ఆరు నెలలు పొడిగించినట్లు హోం శాఖ తెలిపింది. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలకు, నమ్సాయ్ జిల్లాలోని మూడు పోలీస్ స్టేషన్లకు కూడా ఈ చట్టం అమలును ఆరు నెలలపాటు పొడిగించినట్లు ఈ నోటిఫికేషన్ వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఈ చట్టం అమల్లో ఉంటే, గాలింపు, అరెస్ట్, కాల్పులు జరపడానికి భద్రతా సిబ్బందికి సంపూర్ణ అధికారాలు లభిస్తాయి.