WEF | న్యూఢిల్లీ, జనవరి 15: దేశాల మధ్య సాయుధ ఘర్షణలే ప్రపంచానికి తక్షణ ముప్పుగా పరిణమించినట్టు ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచం ఎదుర్కోనున్న ముప్పులపై బుధవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాదిలో భూగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా చీలికలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది.
తప్పుడు సమాచారం వల్ల స్వల్పకాలిక ముప్పులు ఏర్పడుతాయని, రానున్న 10 సంవత్సరాల కాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, జీవవైవిధ్య నష్టం, పర్యవరణ వ్యవస్థ పతనం వంటి పర్యావరణ ముప్పులు అధిక ప్రభావం చూపుతాయని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, ప్రభుత్వ, మేధావి, పౌర సమాజానికి చెందిన 800 మందికిపైగా ప్రపంచ నాయకుల నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను డబ్ల్యూఈఎఫ్ రూపొందించింది.
రానున్న పదేళ్ల కాలంలో ప్రపంచ రాజకీయ పరిస్థితిని అంచనా వేస్తూ బహుళ ధ్రువ లేదా చీలికలతో కూడిన ప్రపంచం ఏర్పడవచ్చని ప్రపంచ నాయకులు అంచనా వేస్తున్నారని నివేదిక వెల్లడించింది. పశ్చిమ దేశాల నాయకత్వం బలహీన పడడం కొనసాగి చైనా, భారత్, గల్ఫ్ దేశాల రూపంలో ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలు బలోపేతం అయ్యే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారని తెలిపింది. అయితే ప్రపంచంపై పశ్చిమ దేశాల ప్రాబల్యం తగ్గుతుండడం కొనసాగినప్పటికీ అవి అధికార కేంద్రంలో ముఖ్యమైన పాత్రను పూర్తిగా కోల్పోబోవని నివేదిక పేర్కొంది.
ప్రపంచం ఎదుర్కోనున్న తక్షణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ముప్పులను వెల్లడించిన ఈడబ్ల్యూఫ్.. రానున్న సవాళ్లను దూరదృష్టితో ప్రపంచ నాయకులు ఎదుర్కోవాలని సూచించింది. భౌగోళిక రాజకీయ, పర్యావరణ, సామాజిక, సాంకేతిక సవాళ్ల కారణంగా ప్రపంచంలో చీలికలు పెరిగిపోతాయని నివేదిక పేర్కొంది. ఇవి సుస్థిరతకు, అభివృద్ధికి అవరోధంగా మారతాయని ఈడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. ఆర్థికపరమైన ముప్పులు ఈ ఏడాది తక్షణం ప్రభావం చూపనప్పటికీ సామాజిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు పరస్పరం ఒకదానికొకటి సంబంధించినవి కాబట్టి అవి ఆందోళన కలిగించే అంశాలేనని నివేదిక పేర్కొంది. 2025లో ప్రభుత్వ ఆధారిత సాయుధ ఘర్షణలు అత్యంత ముఖ్యమైన ప్రపంచ ముప్పుగా పలువురు ఆందోళన వ్యక్తం చేసినట్టు నివేదిక తెలిపింది.