Apple | న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ యూజర్లు తమ పరికరాలను తమ ఆలోచనలతోనే నియంత్రించగలిగే అవకాశం త్వరలోనే రాబోతున్నది. వినియోగదారుని మెదడులో అమర్చగలిగే ఓ డివైస్‌ను అభివృద్ధి చేయడం కోసం సింక్రోన్ అనే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీతో యాపిల్ చేతులు కలిపింది. సింక్రోన్ తయారు చేసే డివైస్‌లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఇవి మెదడు పంపించే సంకేతాలను చదవగలుగుతాయి. సింక్రోన్ అందజేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని యాపిల్ ఉపయోగించుకుని, సిగ్నల్స్‌ను యాక్షన్స్గా మార్చుతుంది.
ఫలితంగా, ఐఫోన్‌ను ఉపయోగించే వ్యక్తి తనకు కావలసినదేమిటో మనసులోనే అనుకుంటే, ఆ పని జరిగిపోతుంది. ఫోన్లో ఏదైనా యాప్‌ను తెరవాలని కోరుకున్నపుడు, ఆ విషయాన్ని మనసులో అనుకుంటే, డివైస్ ఆ పని చేసేస్తుంది. టెక్నాలజీపై యాపిల్, సింక్రోన్ ప్రస్తుతం టెస్టర్స్తో ప్రయోగాలు చేస్తున్నాయి. నరాల సంబంధిత పక్షవాతం వంటి వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి మెదడులో సింక్రోన్ కంపెనీ తయారు చేసిన స్టెంట్రోడ్ డివైస్‌ను అమర్చారు. ఇది స్టెంట్ మాదిరిగా ఉంటుంది. యాపిల్ ఐఫోన్లు, ఇతర డివైస్‌లలో ఈ బ్రెయిన్ ‘స్టెంట్’ అందుబాటులోకి వస్తే, దివ్యాంగులకు గొప్ప వరం అందినట్లే.