న్యూఢిల్లీ: యాపిల్ సంస్థకు ఇవాళ కేంద్రం నోటీసులు ఇచ్చింది. వినియోగదారుల రక్షణకు చెందిన సీసీపీఏ ఆ నోటీసుల్ని రిలీజ్ చేసినట్లు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఐఓఎస్ 18+ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల.. ఐఫోన్లలో సమస్యలు(iPhone Issues) వస్తున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర అథారిటీ యాపిల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత.. సీసీపీఏ ద్వారా యాపిల్ సంస్థకు తమ శాఖ నోటీసులు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. తన సోషల్ మీడియా పోస్టులో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఉత్పన్నం అవుతున్న టెక్నికల్ సమస్యల గురించి యాపిల్ సంస్థ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఐఫోన్ల పర్ఫార్మెన్స్పై నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్కు ఫిర్యాదులు అందినట్లు మంత్రి చెప్పారు. తాజా నోటీసులతో భారత్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న మేటి టెక్నాలజీ సంస్థలపై ప్రభుత్వం నిఘా పెట్టినట్లు అంచనా వేస్తున్నారు.