ప్రయాగ్‌రాజ్: ఆపిల్ సహ వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య, ప్రపంచంలో అత్యంత ధనవంతురాలైన మహిళల్లో ఒకరైన లారెన్ పావెల్ (Laurene Powell Jobs) మహా కుంభమేళాకు హాజరయ్యారు. 40 మంది సభ్యులతో కూడిన బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చారు. రెండు రోజుల క్రితమే (ఈ నెల 11న) భారత్‌కు చేరుకున్న 61 ఏండ్ల లారెన్.. నిరంజని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ స్వామి కైలాషానంద శిబిరంలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన ఆమెకు శిబిరం వద్ద స్వామీజీలు ఘనంగా స్వాగతం పలికారు. లేత పసుపు వర్ణంలో వస్త్రాలు ధరినంచిన లారెన్.. చేతికి రక్షా సూత్ర, మెడలో రుద్రాక్ష మాల ధరించి ఉన్నారు. ఆమె ఈ నెల 15 వరకు అక్కడే ఉంటారు. అనంతరం నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు. ప్రయాగ్‌రాజ్ రావడానికి ముందు వారణాసిలోని కాశి విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు.
లారెన్ పావెల్.. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ఆమె ఆస్తి 15 బిలియన్ల డాలర్లు. స్టీవ్ జాబ్స్ భార్య అయిన లారెన్ పావెల్ యాపిల్ కంపెనీ షేర్స్ నుంచి ఆస్తిని వారసత్వంగా పొందారు. 2021లో ఆమె వేవెర్లీ స్ట్రీట్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. దీనికి వచ్చే నిధులను పర్యావరణ మార్పులను పరిష్కరించేందుకు కేటాయిస్తున్నారు. ఆపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ 2011, అక్టోబర్ 5న మరణించిన విషయం తెలిసిందే.
#WATCH | Prayagraj, UP | Laurene Powell Jobs, wife of the late Apple co-founder Steve Jobs reached Spiritual leader Swami Kailashanand Giri Ji Maharaj’s Ashram pic.twitter.com/y20yu7bDSU
— ANI (@ANI) January 12, 2025
కాగా, ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ ఘనంగా ప్రారంభమైంది. సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం 9.30 గంటల వరకు 60 లక్షల మందికిపైగా పవిత్ర స్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సంక్రాతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు తరలి రానున్నారు. సుమారు 45 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. మరోవైపు ఈ కుంభమేళాకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. భారీగా పోలీసు, భద్రతా బలగాలను మోహరించడంతోపాటు అడుగడుగునా సీసీ కెమెరాను ఏర్పాటు చేసింది. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పరిశీలిస్తున్నది. ఏఐ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు.
దాదాపు 10 వేల ఎకరాల పరిధిలో ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. ఏసమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలు కల్పించారు. భక్తులకు సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎన్డీఆర్ఎఫ్ వాటర్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతోపాటు 45 వేల మంది పోలీసులను మోహరించారు.