Anti-Rahul Posters : ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి (India alliance) అత్యంత కీలక సమావేశం జరుగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. సమావేశానికి ముందు దేశ రాజధాని ప్రధాన కూడళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను ఏర్పాటుచేశారు. రాహుల్‌గాంధీకి రాజకీయ నిలకడ లేదని, తాము కాంగ్రెస్ పార్టీపై ఆధారపడబోమని కూటమి నేతలే అంటున్నట్లు ఆ పోస్టర్లలో పేర్కొనడం గమనార్హం. శరద్ పవార్ (Sharad Pawar), ఎంకే స్టాలిన్ (MK Stalin), అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మమతా బెనర్జీ (Mamata Banerjee) తదితర కీలక నేతల ఫొటోలతో ఈ వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి.
మరోవైపు ఐక్యతను చాటడం, భవిష్యత్తు వ్యూహాలను మార్చుకోవడమే ప్రధాన అజెండాగా ఇండియా కూటమి సమావేశం కొనసాగింది. ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గేలతోపాటు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ హాజరయ్యారు. ఉద్ధవ్ థాకరే వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతీయ పార్టీల ఓటమి, కూటమిలో తలెత్తిన అంతర్గత విభేదాలను సరిచేసుకుంటూ బీజేపీని బలంగా ఢీకొట్టేందుకు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేయడంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ కీలక సమావేశానికి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉండటం గమనార్హం. కూటమి నుంచి తప్పుకోవాలనే ఆలోచనతోనే ఈ రెండు పార్టీలు హాజరుకాలేదని తెలుస్తోంది.