ఆగ్రా: తాజ్‌మహల్(Taj Mahal)కు ప్రత్యేక రక్షణ వ్యవస్థను కల్పించారు. ఆ పాలరాతి కట్టడం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అదనపు భద్రతలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశారు. తాజ్ సెక్యూర్టీకి చెందిన ఏసీపీ సయ్యద్ ఆరిబ్ అహ్మద్ మాట్లాడుతూ.. యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను తాజ్ పరిసరాల్లో దాన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. తాజ్‌మహల్ పరిసరాల్లో ఎటువంటి డ్రోన్లను రానివ్వకుండా యంటీ డ్రోన్ వ్యవస్థను అమర్చినట్లు ఆయన చెప్పారు.
తాజ్‌మహల్ చుట్టూ 500 మీటర్ల మేర యాంటీ డ్రోన్ వ్యవస్థ నిఘా ఉంటుందన్నారు. తాజ్ నుంచి 500 మీటర్ల చుట్టూ ఎటువంటి డ్రోన్ కనిపించినా దాన్ని గుర్తించి, ధ్వంసం చేస్తుందని ఆరిబ్ చెప్పారు. వాస్తవానికి యాంటీ డ్రోన్ వ్యవస్థ.. సుమారు 8 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుందని, కానీ తాజ్ పరిసరాలను సెక్యూర్టీ సున్నిత ప్రదేశంగా భావిస్తూ కేవలం 500 మీటర్ల పరిధికే పరిమితం చేసినట్లు అహ్మద్ తెలిపారు.
రేడియో ఫ్రీక్వెన్సీ, జీపీఎస్ సిగ్నల్ జామ్ టెక్నాలజీ ద్వారా యాంటీ డ్రోన్ వ్యవస్థ.. డ్రోన్లను కూల్చుతుందని ఆయన తెలిపారు. డ్రోన్ కూలిపోగానే అక్కడకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం వెళ్తుందని, తర్వాత ఆ లొకేషన్‌ను ఆధీనంలోకి తీసుకుంటారని చెప్పారు. డ్రోన్‌ను ఆపరేట్ చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిపారు.
వీఐపీలు, ప్రఖ్యాత ప్రదేశాలకు భద్రత కల్పించేందుకు యూపీ పోలీసు శాఖ యాంటీ డ్రోన్ వ్యవస్థలను వినియోగిస్తున్నది. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా, ఆ తర్వాత గత ఏడాది అయోధ్యలో జరిగిన రామ మందిరం ఓపెనింగ్ సెర్మనీ సమయంలో హై టెక్నాలజీ యాంటీ డ్రోన్ వ్యవస్థలను వాడారు.