చండీగఢ్, అక్టోబర్ 14 : హర్యానాలో ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్యపై దర్యాప్తు జరుగుతుండగా, మరో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. పూరన్‌కుమార్‌పై తన సూసైడ్ నోట్లో అరోపణలు చేసిన రోహ్తక్ సైబర్ సెల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన పూరన్ కుమార్‌పై నమోదైన అవినీతి కేసును దర్యాప్తు చేస్తుండటం గమనార్హం. ‘నిజం’ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టు తన ఆత్మహత్య నోట్లో పేర్కొన్నారు. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సందీప్ కుమార్ ఒక వీడియోను, మూడు పేజీల సూసైడ్ నోట్‌ను ఉంచారు. ఆత్మహత్య చేసుకుని మరణించిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఒక ‘అవినీతి పోలీస్’ అని, తన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని ఆత్మహత్య చేసుకున్నాడని అందులో ఆరోపించారు. అంతేకాకుండా పూరన్ కుమార్ కుల వివక్ష అంశాన్ని ఉపయోగించుకుని వ్యవస్థను హైజాక్ చేశారని పేర్కొన్నారు.
పూరన్ కుమార్ గన్‌మేన్ ఒక లిక్కర్ కాంట్రాక్టర్ నుంచి రూ.2.5 లక్షలు లంచం తీసుకున్నాడని, ఆ సంగతి బయటపడిన వెంటనే దానికి కులం రంగు పూయడానికి ప్రయత్నించి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ ఆరోపించారు. పూరన్ కుమార్ రోహ్తక్ రేంజ్‌కు బదిలీ అయిన తర్వాత నిజాయితీ పోలీస్ అధికారులను తప్పించి, ఆ స్థానాల్లో అవినీతి అధికారులతో నింపేశారని, వారు ప్రజల ఫైళ్లను నిలిపివేశారని, పిటిషనర్లను పిలిచి వారిని డబ్బు కోసం మానసికంగా వేధించేవారని, బదిలీల కోసం మహిళా పోలీసులను లైంగికంగా దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. ఆయన అవినీతి మూలాలు చాలా లోతున ఉన్నాయని, తనపై ఫిర్యాదు రాగానే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ‘అతనో అవినీతి పోలీస్. ఇది కులానికి సంబంధించిన అంశం ఎంతమాత్రం కాదు. ఆయన ఆస్తులపై తప్పక దర్యాప్తు చేయాలి. నిజం బయటకు రావాలి’ అని ఆయన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ‘నా జీవితాన్ని నిజం కోసం త్యాగం చేస్తున్నాను. నిజాయితీ కోసం నిలబడినందుకు గర్విస్తున్నాను. దేశాన్ని మేల్కొల్పడానికి ఇది ముఖ్యం’ అని తెలిపారు. తన కుటుంబ సభ్యులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారని ఆయన వెల్లడించారు. కాగా, పూరన్ కుమార్ ప్రధాన ఆరోపణలు చేసిన రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను సందీప్ కుమార్ ప్రశంసించారు.