న్యూఢిల్లీ, జూలై 24: దేశంలో మంకీపాక్స్ వైరస్ కలకలం రేపుతున్నది. ఢిల్లీకి చెందిన 34 ఏండ్ల వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు ఆదివారం నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసులు నాలుగుకు చేరాయి. తొలి మూడు కేసులు కేరళలో నమోదైన విషయం తెలిసిందే. అయితే బాధితుడు ఇటీవల విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలడం ఆందోళన కలిగిస్తున్నది.
ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో జరిగిన ఓ పార్టీకి అతడు హాజరైనట్టు సమాచారం. అతడికి మూడు రోజుల కిందటే మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. వెంటనే అతడిని ఢిల్లీలోని లోక్‌నాయక్ జయ ప్రకాశ్ దవాఖానలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. పుణే వైరాలజీ ల్యాబ్‌కు అతడి నమూనాలను శనివారం పంపగా, రిపోర్టులో మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. అతడితో తిరిగిన వ్యక్తులను గుర్తించి హోం క్వారంటైన్లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.
మంకీపాక్స్ నివారణకు కూడా కరోనాకు పాటించిన జాగ్రత్తలే మనకు రక్ష అని వైద్యులు చెబుతున్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేస్తే మంకీపాక్స్ నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడం, టెస్టులు పెంచడం, ప్రైవేటు వైద్యులు చికిత్స అందించడం వంటి చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నది.
మంకీపాక్స్ వైరస్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోకే అవకాశాలు ఉన్నాయి. జంతువుల నుంచి మనుషులకు, మనుషులకు నుంచి మనుషులకు సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తి చర్మాన్ని నేరుగా తాకడం, పుండ్లను తాకడం, తుమ్ము, దగ్గు ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా కానీ ఈ వైరస్ అంటుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో 16 వేల మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. విదేశీ ప్రయాణ చరిత్ర లేకున్నా ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకడంపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. దేశంలో మంకీపాక్స్ స్థితిగతులపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. దీంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండు వైరస్లు ఒకేసారి సోకడం ఇదే తొలిసారి. ఇది చాలా అరుదైన కేసు అని, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.