Delhi Blast | ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పేలుడుకు ఉపయోగించిన ఐ20 కారును నాలుగు రోజుల కిందట ఫరీదాబాద్‌లోని ఓ డీలర్ నుంచి కొనుగోలు చేశారు. ఆ డీలర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాయల్ కార్ జోన్లో కార్ డీలర్ అయిన సోనుకు ఫరీదాబాద్‌లోని సెక్టార్ 37లో ఆఫీస్ ఉంది. అతను ఓఎల్ఎక్స్లో (OLX)లో కార్ల అమ్మకాల కోసం పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత కారును విక్రయించాడు. సోనును అరెస్టు చేసి ఢిల్లీ స్పెషల్ సెల్‌కు అప్పగించినట్లు ఫరీదాబాద్ పోలీస్ ప్రతినిధి యశ్పాల్ సింగ్ తెలిపారు.
ఢిల్లీలో పేలుడు జరిగిన కారు ఏడుసార్లు అమ్ముడైంది. ఎర్రకోట ముందు పేలిన టీ20 కారు హర్యానాకు చెందింది. ఈ కారు గురుగ్రామ్ నార్త్ రైల్వే స్టేషన్ (RTO)లో రిజిస్టర్ అయినట్లు సమాచారం. ఒక సంవత్సరంలో ఏడుసార్లు అమ్ముడైంది. ఈ పేలుడు బాగా ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద కుట్రగానే పోలీసుల పేర్కొంటున్నారు. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న శిథిలాల్లో ఐఈడీ అవశేషాలను గుర్తించారు. పేలుడు జరిగిన ప్రదేశంలో ఎలాంటి గుంత ఏర్పడలేదని, మృతదేహాలు నల్లగా మారలేదని చెబుతున్నారు. ఎన్ఐఏ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఫోరెన్సిక్ బృందాలు మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఉగ్రవాద మాడ్యూల్ సంబంధాలను ఛేదించడానికి భద్రతా సంస్థలు కృషి చేస్తున్నాయి.
పోలీస్ అధికారుల ప్రకారం.. కారు వెనుక భాగంలో పేలుడు జరిగింది. వెనుక భాగంలో ఐఈడీ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పేలుడు జరిగిన కారు నంబర్ HR-26-CE 7674. ఈ కారు హర్యానాలోని గురుగ్రామ్ నివాసి సల్మాన్ పేరుతో రిజిస్టర్ అయ్యింది. పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కారును ఓఖ్లా నివాసి దేవేంద్రకు విక్రయించాడని తెలిపాడు. ఆ తర్వాత దేవేంద్ర దాన్ని అంబాలాలో థర్డ్ పార్టీకి విక్రయించాడు. అక్కడి నుంచి కారును పుల్వామా నివాసి తారిక్కు విక్రయించాడు. 2019లో ఉగ్రవాదులు పుల్వామాలో ఇలాంటి పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని పేల్చి, 40 మంది సైనికులను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.
పేలుడు జరిగిన కారును మూడుగంటల పాటు నిలిపి ఉంచినట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌లో వెల్లడైంది. సమాచారం మేరకు.. హ్యుందాయ్ ఐ20 కారు మొదట సల్మాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయ్యింది. పోలీసులు వెంటనే సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. విచారణలో సల్మాన్ కారును వేరొకరికి అమ్మినట్లు పేర్కొన్నాడు. సల్మాన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రస్తుతం రవాణాశాఖను సంప్రదిస్తున్నారు. పేలుడు సమయంలో కారు ఎవరి పేరుపై ఉంది.. ఇటీవల సల్మాన్ నుంచి ఈ కారును ఎవరు కొనుగోలు చేశారో ఆర్టీవో రికార్డుల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో మృతి చెందిన వారిలో ఇప్పటి వరకు ఇద్దరిని గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని హసన్‌పూర్‌కు చెందిన అశోక్ కుమార్, ఢిల్లీలోని శ్రీనివాస్పురి నివాసి అమర్ కటారియాను మాత్రమే గుర్తించారని.. మిగతా మృతుల వివరాలు వెల్లడికాలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. మృతదేహాలను గుర్తించేందుకు భద్రతా, దర్యాప్తు సంస్థలు డీఎన్ఏ, ఇతర సాంకేతిక సహాయంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు మృతి చెందిన వారి కుటుంబాలకు సమాచారం అందించారు.
సోమవారం సాయంత్రం జరిగిన పేలుడుతో ఢిల్లీలో ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో కారులో జరిగిన భారీ పేలుడు జరగ్గా.. కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. పేలుడు కారణంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో.. దాని ధాటికి మృతుల శరీర భాగాలు ముక్కలై చాలాదూరం వరకు ఎగిరిపడ్డాయి. సమీపంలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీవో కూడలి వరకు వినిపించింది. పేలుడు నేపథ్యంలో దేశ రాజధానిలోని కీలకమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు.