Agra | ఆగ్రా, ఫిబ్రవరి 28: దేశంలో మరో భార్య బాధితుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈ దేశంలో మగవారిని రక్షించేందుకు చట్టాలు లేవని, తన భార్య చర్యల కారణంగా తాను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నానంటూ యూపీలోని ఆగ్రాకు చెందిన ఒక టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. టీసీఎస్‌లో పనిచేసే మానవ్ శర్మ ఈ నెల 24న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మరణించిన రెండు రోజులకు మానవ్ ఫోన్లోని వీడియోను అతని సోదరి గమనించింది.
ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన వీడియోలో తన భార్యే తన చావుకు కారణమని ఆరోపించాడు. దీంతో మానవ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు రికార్డు చేసిన 7 నిమిషాల వీడియోలో ‘నా భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. కానీ నేను ఏం చేయగలను. దయుంచి పురుషుల గురించి ఎవరైనా మాట్లాడాలి. వారు ఒంటరి వారు. చట్టాలు పురుషులను రక్షించాలి’ అని పేర్కొన్నాడు. కాగా, తనపై చేసిన ఆరోపణలను భార్య నిఖిత ఖండించింది.