ముంబై, జూన్ 25: నీట్ పరీక్షలో అక్రమాలకు సంబంధించి కొత్త అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. నీట్ అక్రమాల వ్యవహారం ఈ ఏడాది మొదలయ్యింది కాదా, గతంలోనూ జరిగాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిసారి నీట్ పరీక్ష రాసి లక్షల్లో ర్యాంకులు సాధించిన కొందరు విద్యార్థులు రెండోసారి మాత్రం అనూహ్యంగా మెరుగైన ర్యాంకులు సాధించిన ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఇలా మంచి ర్యాంకులు సాధించిన వారిలో కొందరు ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇలా రెండోసారి మంచి ర్యాంకులు సాధించిన కొందరు నగరాలకు దూరంగా మారుమూల పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో పరీక్షలు రాయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది.
మొదటిసారి లక్షల్లో ర్యాంకులు సాధించి, రెండోసారి మాత్రం వేలల్లోకి ఎగబాకిన విద్యార్థులకు సంబంధించిన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ప్రచురితమైన కథనం కొన్ని ఉదాహరణలను ప్రస్తావించింది. ముంబైలోని ఎల్టీఎంజీ సియాన్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థిని 2022లో మొదటిసారి నీట్ పరీక్ష రాసినప్పుడు రెండు లక్షలపైన ర్యాంకు సాధించింది. కానీ, రెండోసారి 2023లో పరీక్ష రాసి ఆమె 8 వేల ర్యాంకు దక్కించుకుంది.
అలాగే, ముంబైలోనే ప్రభుత్వ దవాఖానలో ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న మరో విద్యార్థినికి 2022లో 10 లక్షలకు పైగా ర్యాంకు రాగా, 2023లో మాత్రం రెండో ప్రయత్నంలో 13వేల ర్యాంకు వచ్చింది. ఇలా రెండోసారి నమ్మశక్యం కాని విధంగా ర్యాంకులు మెరుగుపడ్డ విద్యార్థులు కొందరు వారు నివసించే నగరాలకు దూరంగా ఉండే చిన్న పట్టణాల్లోని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయడం అనుమానాలకు తావిస్తున్నది. కొందరు కర్ణాటకలోని బెళగావి సమపంలో, మరికొందరు బీహార్లోని పట్నాకు కొంత దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో పరీక్ష రాశారని తెలుస్తున్నది. ఈ అంశంపై ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్టు తెలుస్తున్నది.
నీట్ అక్రమాల వ్యవహారంలో కొన్ని పరీక్షా కేంద్రాల పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. గోద్రాలో నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని గుజరాత్ పోలీసులు బయటపెట్టారు. ముందుగా విద్యార్థులను వారికి తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాయమని, తెలియని వాటిని ఏమీ రాయకుండా వదిలేయమని చెప్పారు. ఆ తర్వాత పేపర్లను ప్యాక్ చేసే ఆర గంట ముందు విద్యార్థుల పేపర్లపై పరీక్ష కేంద్రం డిప్యూటీ సూపరింటెండెంట్ జవాబులు రాయాలనుకున్నారని పోలీసులు గుర్తించారు. సాధారణంగా గోద్రా పరీక్ష కేంద్రాన్ని సమీప ప్రాంతాల విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఎంచుకుంటారు. కానీ, వేర్వేరు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు గోద్రా పట్టణాన్ని పరీక్ష రాసేందుకు ఎంచుకోవడం అక్రమాలు జరిగాయనే వాదనకు బలం చేకూరుస్తున్నది.