IndiGo | దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకున్నది. పెద్ద ఎత్తున విమానాలు రద్దు చేయడంతో పాటు ఆలస్యం కావడంతో తీవ్రమైన కార్యాచరణ గందరగోళాన్ని ఎదుర్కొంటున్నది. ఈ అంతరాయానికి కారణం విమాన సిబ్బంది తీవ్ర కొరత, షెడ్యూల్‌ను నిర్వహించే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ క్రమంలో ఇండిగో పైలట్ల పేరుతో రాసిన ఓ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సీఈవో పీటర్ ఎల్బర్స్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇండిగోను పతనం అంచుకు నెట్టారని ఆ లేఖలో ఆరోపించారు. ఇండిగో సంక్షోభం రాత్రికి రాత్రే తలెత్తలేదని.. అది సంవత్సరాలుగా జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. 2006లో ఇండిగో ప్రారంభం నుంచే మొదలైంది లేఖలో ప్రస్తావించారు.
అనుభవం, అర్హతలను విస్మరించి, నైపుణ్యం, కార్యాచరణ అవగాహన లేని వ్యక్తులకు కీలక పదవులను అప్పగించడంతో ఎయిర్‌లైన్ పతనం ప్రారంభమైందని ఆరోపించారు. పైలట్లు, సిబ్బంది అలసట, భద్రత, నిబంధనలను విస్మరించారని లేఖలో పేర్కొన్నారు. అలసట, పని ఒత్తిడి డ్యూటీలను వ్యతిరేకించిన పైలట్లను కార్యాలయానికి పిలిచి మందలించడం, బెదిరింపులకు దిగడం, అవమానించినట్లు లేఖలో ప్రస్తావించారు. అదనంగా జీతం చెల్లించకుండా డ్యూటీలు, షిఫ్ట్‌లు, పెరిగిన పనిభారం మొపారని.. సిబ్బంది ఉద్యోగాల్లో సంతోషంగా ఉండాలని కానీ.. కాలక్రమేణా విమానయాన సంస్థలో విషపూరితమైన పని సంస్కృతి అభివృద్ధి చెందిందని లేఖలో ఆరోపించారు.
ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తిని సంవత్సరాలుగా విస్మరించారని.. ఆ ప్రభావం ప్రస్తుతం కార్యాచరణ సంక్షోభం రూపంలో వ్యక్తమవుతుందన్నారు. లేఖలో ఎనిమిది మంది ఉన్నతాధికారులు ప్రస్తుత సంక్షోభానికి బాధ్యులుగా పేర్కొన్నారు. లేఖలో మొదట పేరు సీఈవో పీటర్ ఎల్బర్స్ పేరు ఉంది. ఈ సంక్షోభ సమయంలో ఆయన సెలవులో ఉన్నాడని.. స్వస్థలం నెదర్లాండ్స్‌కు వెళ్లినట్లుగా ఆరోపించారు. ఈ సంక్షోభానికి జాసన్ హార్టర్, అదితి కుమారి, తపస్ డే, రాహుల్ పాటిల్, సీవోవో పోర్కెరాస్, అసిమ్ మిత్రా (ఫ్లైట్ ఆపరేషన్స్ ఎస్వీపీ), అక్షయ్ మోహన్ ఉన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్‌ల నిర్ణయాల కారణంగా గతవారం రోజులుగా ఇండిగో కార్యాచరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లుగా లేఖ ఆరోపించింది. పైలట్ల పేరుతో రాసిన లేఖ వైరల్‌గా మారింది.