ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సోమవారం నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను నిలిపివేశారు. స్వగ్రామమైన మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో ఆదివారం నిర్వహించిన గ్రామ సభలో ఈ మేరకు ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వైన్ పాలసీని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో వైన్ విక్రయాలకు అనుమతి ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఆ రాష్ట్ర కేబినెట్ కూడా ఈ ప్రదిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.
కాగా, మహారాష్ట్రకు చెందిన సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా ప్రభుత్వ వైన్ పాలసీని తప్పుపట్టారు. సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో వైన్ విక్రయాలకు అనుమతి ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలతో మద్యం మాన్పించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం వారిని మద్యానికి బానిసలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాల కోసం, రైతులకు లబ్ధి పేరుతో ఇలాంటి చర్యలు తగవన్నారు. మహారాష్ట్ర సంస్కృతిని ఇది నాశనం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 14 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఇటీవల హెచ్చరించారు. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ కూడా రాశారు.
మరోవైపు, సూపర్ మార్కెట్లు, పెద్ద కిరణా షాపుల్లో వైన్స్ అమ్మకాల ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నిర్ణయంపై ముందుకు వెళ్లే ముందు ప్రజల అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని అన్నా హజారేకు తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు.