న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనిరుద్దాచార్య(Aniruddhacharya) క్షమాపణలు చెప్పారు. 25 ఏళ్ల అమ్మాయిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన సారీ చెప్పారు. వృందావన్లోని గౌరీ గోపాల్ ఆశ్రమంలో ప్రసంగం చేస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ వీడియో వైరల్ కావడంతో .. అనిరుద్దాచార్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు 25 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదని, 25 ఏళ్లు నిండిన అవివాహిత మహిళలు ఏదో ఓ సందర్భంలో తమ యవ్వాన్ని కోల్పోవడం సహజమే అని ఆయన వ్యాఖ్యలు చేశారు. తన ప్రవచనంలో ఆ స్వామీజీ.. ఇటీవల జరిగిన సెన్షేషనల్ మర్డర్ గురించి చెప్పారు. సోనమ్ రఘువంవీ, ముస్కార్ రస్తోగి కేసులను ఆయన ఊటంకించారు. హానీమూనికి వెళ్లిన మహిళ.. అప్పటికే మరో వ్యక్తితో రిలేషన్లో ఉందన్నారు. అమ్మాయిలు 14 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకోవాలని, దాంతో వాళ్లు తొందరగా ఫ్యామిలీలో ఒదిగిపోతారని అనిరుద్దాచార్య అభిప్రాయపడ్డారు.
అనిరుద్దచార్య చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని, శృంగారపూరితంగా ఉన్నాయని మథుర బార్ అసోసియేషన్ మహిళా అడ్వకేట్లు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టి, స్వామీజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యల పట్ల వివాదం ముదరడంతో.. అనిరుద్దాచార్య క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి, వీడియోను ఎడిటింగ్ చేసినట్లు ఆయన చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవర్ని బాధపెట్టిన, తాను క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. కేవలం కొందర్ని ఉద్దేశించి మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని, యావత్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకోలేదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తన వీడియోను ఎడిట్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.